సర్వే లోగుట్టు విప్పిన లగడపాటి… కేటిఆర్ కు ఝలక్

తెలంగాణ ఎన్నికల పై సర్వే వివరాలు ప్రకటించిన లగడపాటి రాజగోపాల్ కేటిఆర్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. లగడపాటిది గోబెల్స్ ప్రచారమని, చిలక జోస్యమంటూ విమర్శించారు. కేటిఆర్ కు లగడపాటి పెట్టిన వాట్సాప్ మెసేజ్ ల సందేశం కూడా కేటిఆర్ రిలీజ్ చేశారు. దీంతో లగడపాటి రాజగోపాల్ కేటిఆర్ వ్యాఖ్యల పై స్పందించారు. అన్ని వివరాలు తెలిపారు. లగడపాటి రాజగోపాల్ ఏమన్నారంటే..

“నేనేవరి ఒత్తిడితోనో సర్వే వివరాలు మార్చలేదు. కేటిఆర్ సెప్టెంబర్ 15 లేదా 16 వ తేదిలలో కలిశారు. మా సంస్థ చేయించిన సర్వే వివరాలు తెలుసుకున్నారు. అప్పటికి ఇంకా మహా కూటమి ఏర్పడలేదు. అప్పుడు మా టీం ఇచ్చిన నివేదిక వివరాలు కేటిఆర్ కు చెప్పాను. అప్పుడు టిఆర్ఎస్ కే అనుకూలంగా ఉంది. కేటిఆర్ చూపించిన వాట్సాప్, ట్వీట్టర్ మెసేజ్ లు సెప్టెంబర్ లో నా వద్ద ఉన్న సమాచారం ఆధారంగా పంపించినవి. కానీ కూటమిగా పార్టీలన్నీ కలిశాక చేయించిన సర్వే వివరాలు మంగళవారం ప్రకటించాను. కేటిఆర్ నన్ను కలిసినప్పుడే ఎమ్మెల్యేల పై ప్రతికూలత ఉందని చెప్పాను. అవసరమైతే ఎమ్మెల్యే అభ్యర్దులను మార్చాలని కూడా అన్నాను.

ఎమ్మెల్యే అభ్యర్దుల పై కోపంతో ఓటు అటువైపు వెళుతుందని కేటిఆర్ కు చెప్పాను. 65 మంది ఎమ్మెల్యే అభ్యర్దుల పై వ్యతిరేకత ఉందన్నాను. ఓటు ట్రాన్స్ ఫర్ పైనా కూడా మా మధ్య చర్చ జరిగింది. కేటిఆర్ 23 నియోజకవర్గాల పై సర్వే చేయమన్నారు. ఆ వివరాలు కూడా కేటిఆర్ కు పంపించాను. అన్ని పార్టీలు కలిస్తే పోటా పోటి ఉంటుందని కూడా చెప్పాను. ఎన్నికల సమయంలో అరెస్టులు లాంటివి చేయవద్దని కూడా చెప్పాను. నవంబర్ 11 నాటికి ఉన్న సమాచారం ఆధారంగా  కాంగ్రెస్ 37 స్థానాల్లో గెలుస్తుందని కేటిఆర్ కు  చెప్పాను. వరంగల్ జిల్లాలో టిఆర్ ఎస్ కు అనుకూలత వస్తుందని ముందుగా మా సర్వేలో తేలింది. కాని ఇప్పుడు వరంగల్  కూడా పూర్తిగా కాంగ్రెస్ వైపు వెళ్లింది. మైనారీటిలలో చాలా వేగంగా మార్పులు వచ్చాయి.

నేనేవరి ఒత్తిడితోనో వివరాలు మార్చలేదు. కేటిఆర్ కు కూడా తెలుసు. కేటిఆర్ బయటపెట్టిన వివరాలు సెప్టెంబర్ లో జరిగినవి. అవి ఇప్పటివి కాదు. మంగళవారం వచ్చిన వివరాలతో సర్వే ఫలితాలు ప్రకటించాను. ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా ప్రజలల్లో మూడు ఎకరాలు భూమి, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పై వ్యతిరేకత వచ్చింది. విద్యార్దులు, యువకులు అందరిలో కూడా ప్రభుత్వం పై వ్యతిరేకత ఉంది. రైతు బంధు పథకం , గొర్రెల పంపిణీ అందరిని ఆకర్షించలేదు. కేసీఆర్ కు కూడా వ్యతిరేకత తెలిసే సంవత్సరం ముందుగానే ప్రజల్లోకి వెళ్లాలనే భావనతో భారమైనా  కూడా రైతు బంధు పథకాన్ని తీసుకు వచ్చారు. ప్రభుత్వం పై వ్యతిరేకత ఉన్నప్పుడే ఇటువంటి విషయాలు ప్రభావితమవుతాయి.

నేను నిజాలు చెబుతున్నాను. ఏ రాజకీయ పార్టీలో నేను లేను. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను నేను చివరి సారిగా 2013 లో కలిశాను. కేసీఆర్ ను ఐదేళ్లలో నేనేప్పుడు కలవలేదు. నేను తెలంగాణకు వ్యతిరేకమైతే కేటిఆర్ కు సర్వే చేసి వివరాలు ఎందుకు చెబుతాను. సర్వే నివేదిక వారికి అనుకూలం అని ప్రకటించినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు. ఇంకా రెండు రోజుల సమయం ఉంది ఏమైనా జరగవచ్చు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఓడినా నాకు ఒరిగేదేమి లేదు. నాకు ఎవరి దగ్గర చేయి చాచే అలవాటు లేదు.

రాజకీయ అనుభవంతో కేటిఆర్ కు కొన్ని సూచనలు చేశాను. ప్రజా కూటమిలో సీట్ల గొడవ నడుస్తున్నప్పుడు మరో నివేదిక కూడా పంపాను. కేటిఆర్  .. కేసీఆర్ మీద చేసినట్టుగా చెబుతున్న వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు. కేటిఆర్ అమెరికాకు వెళ్లిపోతానని నాతో చాట్ చేయలేదు.
ఆదిలాబాద్ ఎస్సీ ఎస్టీ బెల్ అంతా కూటమి వైపుకు వెళ్లింది. ఇంకా 48 గంటలు ఉంది ఏమైనా జరగొచ్చు. ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను. ప్రజా కూటమికే విజయావకాశాలు ఉన్నాయి. ఈ రెండు రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి

గజ్వేల్ నియోజకవర్గంలో ఓ కీలక నేత ఓడిపోనున్నారు. ఆ విషయాన్ని పోలీసులే నాకు చెప్పారు. ఆయన పేరు నేను చెప్పను. అక్టోబర్ 28న నేను గజ్వేల్ వెళ్లాను. ఆ సమయంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. నా కారును కూడా ఆపి చెక్ చేశారు. వారు నన్ను కిందకి దిగమని కోరి నాతో సెల్ఫీలు కూడా తీసుకున్నారు. గజ్వేల్ లో రాజకీయాలు ఎలా ఉన్నాయి అని అడిగాను . పోతారు సార్ అని వారు నాకు సమాధానం ఇచ్చారు. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారి నాకు చెప్పారు.” అని రాజగోపాల్ తెలిపారు.