తెలంగాణ ఎన్నికల పై లగడపాటి సర్వే… గెలిచేది వీరే

తెలంగాణ ఎన్నికల పై లగడపాటి రాజగోపాల్ సంచలన జోస్యం చెప్పారు. లగడపాటి రాజగోపాల్ ఎన్నికలకు ముందు గతంలో సర్వేలు చేసి చెప్పిన ఫలితాలు నిజమయ్యాయి. ప్రస్తుతం జరగనున్న తెలంగాణ ఎన్నికల పై కూడా రాజగోపాల్ ఇప్పటికే సర్వే చేశారు. దాని పూర్తి ఫలితాలను డిసెంబర్ 7 తర్వాత ప్రకటిస్తానన్నారు. శుక్రవారం తిరుమల పర్యటనకు వచ్చిన రాజగోపాల్ తెలంగాణ ఎన్నికల పై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆయన ఏమన్నారంటే..

“తెలంగాణ ఎన్నికల పై అంతా ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పలు ప్రాంతాల్లో ప్రధాన పార్టీ అభ్యర్ధులను ప్రజలు తిరస్కరిస్తున్నారు. తెలంగాణ ప్రజలు చాలా తెలివి కలవారు. ఏ పార్టీలు డబ్బు ఇచ్చినా లేదా ఇతర రకాలుగా ప్రలోభ పెట్టిన కూడా ఈ సారి ఎన్నికల్లో సంచలన తీర్పు ఇవ్వబోతున్నారు. ఏ ప్రలోభాలకు లొంగకుండా ఈ సారి స్వతంత్ర అభ్యర్ధులకు తెలంగాణ ప్రజలు పట్టం కట్టబోతున్నారు. అనూహ్యంగా ఇండిపెండెంట్లను వారు ఎన్నుకోబోతున్నారు. 10 మంది ఇండిపెండెంట్లు గెలుస్తారు.

స్వతంత్ర అభ్యర్ధులుగా గెలిచే అభ్యర్దుల వివరాలు రోజుకు ఇద్దరి పేర్లు చెప్పుతా. అన్ని వివరాలు డిసెంబర్ 7 తర్వాత ప్రకటిస్తాను. మహబూబ్ నగర్ జిల్లా నారాయణ పేట నుంచి స్వతంత్ర అభ్యర్ధి  శివకుమార్, ఆదిలాబాద్ జిల్లా బోథ్ నుంచి స్వతంత్ర అభ్యర్ధి అనిల్ జాదవ్ గెలుస్తారు. ప్రజలు చాలా తెలివైన వారు. తమకు న్యాయం చేసే వారిని ఎన్నుకుంటారు. ఆ చైతన్యం తెలంగాణ ప్రజలలో అధికంగా ఉందని ఈ ఎన్నికలు స్పష్టం చేస్తాయి. “ అని లగడపాటి రాజగోపాల్ తెలిపారు.

లగడపాటి రాజగోపాల్ గతంలో విజయవాడ ఎంపీగా పని చేశారు. పెద్ద వ్యాపారవేత్తగా లగడపాటి రాజగోపాల్ కు పేరుంది. అనేక వ్యాపార సంస్థలు రాజగోపాల్ కు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వవద్దని పార్లమెంట్ లో పోరాడారు. తెలంగాణ ఇస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని రాజగోపాల్ ప్రకటించారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పాస్ అయ్యే సమయంలో రాజగోపాల్ పేప్పర్ స్ప్రే చల్లడంతో పార్లమెంట్ లో గందరగోళ వాతావరణం ఏర్పడింది.

శివకుమార్ రెడ్డి

తెలంగాణ బిల్లు పాస్ అయ్యి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకొని ఏ పార్టీలో చేరకుండా ఉన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాపార సంస్థలు చూసుకుంటూ హైదరాబాద్ లో నే ఉంటున్నారు. ప్రజలకు, పార్టీలకు ఆయన దూరంగా ఉంటున్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రకటన రాగానే లగడపాటి తన సర్వే చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం సర్వేలు ప్రకటించవద్దనడంతో ఆయన ఆగిపోయారు.

వివిధ పార్టీల కీలక నేతలు, అధికారులు కూడా లగడపాటిని సంప్రదించి ఎవ్వరు గెలువబోతున్నారో చెప్పాలి అని ఆసక్తిగా అడిగినట్టు తెలుస్తోంది. దీంతో లగడపాటి సర్వేకు క్రేజి ఏర్పడింది. తిరుమల పర్యటనకు శుక్రవారం వచ్చిన లగడపాటి విలేఖరులు అడిగిన ప్రశ్నలకు పూర్తిగా సమాధానం చెప్పకుండా కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పి తెలంగాణ రాజకీయాలను హీటెక్కించారు. తనకు ఏ రాజకీయ పార్టీ, వ్యక్తులతో స్పష్టం చేశారు. స్వతంత్ర్య అభ్యర్దులు గెలవబోతున్నారనడంతో అధికార టిఆర్ఎస్,  కూటమి నేతల్లో టెన్షన్ మొదలైంది.