రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షుడు క్యామ మల్లేష్ కు జారీ చేసిన షోకాజ్ నోటిసు పై ఆయన స్పందించారు. తనను డిసిసి అధ్యక్షునిగా తొలగించడం అన్యాయమన్నారు. 35 సంవత్సరాలుగా తాను పార్టీ కోసం పని చేస్తున్నానన్నారు. రెండు సార్లు పార్టీ ప్రభుత్వం చేపట్టినా కూడా తాను ఏ పదవి తీసుకోలేదన్నారు.
తాను రాహుల్ గాంధీ, సోనియా గాంధీల పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తాను ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించలేదన్నారు. తాను ఏమన్నానని తన పై చర్య తీసుకున్నారో చెప్పాలన్నారు. చర్యలు తీసుకోవాల్సింది తన పై కాదన్నారు. అధిష్టానం పై వ్యాఖ్యలు చేసిన రాజగోపాల్ రెడ్డిని ఏమనకుండానే ఎమ్మెల్యే టికెటిచ్చారు. పార్టీ టికెట్ ఇవ్వకపోతే పార్టీ దిమ్మెను కూలగొట్టిన కార్తిక్ రెడ్డి పై చర్యలు లేవు.
రాజగోపాల్ రెడ్డి టికెట్ క్యాన్సల్ చేయండి, కార్తీక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. తన పై చర్యలు తీసుకోవడం కాదన్నారు. తాను బిసిననే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా అని ప్రశ్నించారు. బలహీన వర్గాలు బిసిలకు అవసరం లేదా పార్టీ స్పందించిన తీరు పై గొల్ల కురుమలు ప్రశ్నిస్తారన్నారు. 35 సంవత్సరాలుగా పార్టీ కోసం పని చేస్తే ఎమ్మెల్యేగా పోటి చేసే అర్హత తనకు లేదా అని క్యామ మల్లేష్ ప్రశ్నించారు.
తాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా స్వంత డబ్బులతో పని చేశానన్నారు. పార్టీ కోసం ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా పని చేశానన్నారు. ఇంత కాలంలో పార్టీ కోసం పని చేసి కుటుంబాన్ని కూడా తాను సరిగా పట్టించుకోలేదన్నారు. బంధువులకు దూరమయ్యానన్నారు. అన్నింటిని వదిలి పార్టీ కోసం 35 సంవత్సరాలుగా కష్ట పడితే పార్టీ తనకిచ్చే బహూమానం తొలగింపులు, షోకాజ్ నోటిసులా అని ఆయన ప్రశ్నించారు.
ఎమ్మెల్యే టికెట్ అడిగితే తనను డబ్బులు డిమాండ్ చేశారని ఇదే విషయాన్ని ఉత్తమ్ కుమార్ కి, కుంతియాకు చెప్పిన పట్టించుకోలేదన్నారు. అందుకే ఆవేశంతో మీడియా ముందుకు వచ్చి మాట్లాడానన్నారు. రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నించినందుకు షోకాజ్ నోటిసులు జారీ చేశారని విధేయతతో పని చేసిన తనకు అన్యాయం ఎలా చేస్తారని ప్రశ్నించారు. పార్టీ టికెట్ కేటాయించలేదని తెలిసిన తర్వాత తన ఆరోగ్యం క్షీణించిందని ప్రస్తుతం తాను అనారోగ్యంతో బాధపడుతున్నానన్నారు.
ఇబ్రహీంపట్నం టికెట్ ఆశించి అధిష్టానం టికెట్ కేటాయించకపోవడంతో ఆగ్రహంతో క్యామ మల్లేష్ పార్టీ పై విమర్శలు చేశారు. తనకు అన్యాయం జరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్త చరణ్ దాస్ 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని ఆడియో టేపును బయటపెట్టారు. ఇది కాంగ్రెస్ ను కలవర పెట్టింది. దీంతో అధిష్టానం మల్లేష్ ను రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా తొలగించింది. షోకాజ్ నోటిసులకు సమాధానం చెప్పకపోతే పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తామని టిపిసిసి ఉత్తర్వులు జారీ చేసింది. రాజగోపాల్ రెడ్డి, ,సందీప్ రెడ్డిల పై చర్యలు తీసుకున్నాకే తన పై చర్యలు తీసుకోవాలన్నారు.