కూకట్‌పల్లిలో జనసేనకు వ్యతిరేకంగా టీడీపీ రాజకీయం.!

జనసేన – టీడీపీ మధ్య మైత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమా.? అంతే అనుకోవాలేమో.! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి.. అందునా, మరీ ముఖ్యంగా కూకట్‌పల్లి నియోజకవర్గం విషయమై జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీ ఓ రాజకీయ శతృవులా భావిస్తోందా.? అంతే అనుకోవాలేమో.!

కూకట్‌పల్లిలో జనసేన అభ్యర్థి పోటీ చేస్తున్నారు. కానీ, ఆ అభ్యర్థిని బీజేపీ నేతగానే స్థానిక టీడీపీ శ్రేణులు చూస్తున్నాయి. బీజేపీ నుంచే ఆ అభ్యర్థి, జనసేనలోకి వచ్చిన సంగతి తెలిసిందే. రాజకీయాలన్నాక నాయకులు గోడలు దూకేయడం కొత్త కాదు.! కానీ, మమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్ విషయంలో టీడీపీ ఉలిక్కిపడుతోంది.

వాస్తవానికి గతంలో కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో ఆమెకు సోదరులు నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీయార్‌ల నుంచి ఎలాంటి మద్దతూ లభించలేదు.

ఇక, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టయ్యాక, తెలంగాణలో.. అందునా, కూకట్‌పల్లి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు చాలా చాలా యాక్టివ్ అయ్యాయి. తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందనీ, చెప్పుకోదగ్గ సీట్లు సాధిస్తుందనీ తెలంగాణ టీడీపీ నేతలు కొందరు భావించారు. కూకట్‌పల్లి అయితే టీడీపీనే గెలుస్తుందని చెప్పుకున్నారు.

కానీ, విషయం తేడా కొట్టేసింది. టీడీపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికే భయపడింది. అనూహ్యంగా జనసేన రేసులోకి వచ్చింది. అదీ బీజేపీ పొత్తుతో. ఈ నేపథ్యంలో, జనసేన గనుక కూకట్‌పల్లి గెలిస్తే, రాజకీయంగా జనసేన బలం నిరూపితమవుతుందన్న ఆందోళన టీడీపీలో కనిపిస్తోంది. అందుకే, జనసేనకు వ్యతిరేకంగా కూకట్‌పల్లి నియోజకవర్గంలో టీడీపీ చాలా చాలా అతి చేస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన గెలిచే అవకాశం కాస్తో కూస్తో వున్న ఏకైక నియోజకవర్గం కూకట్‌పల్లి మాత్రమే. ఈ విషయం తెలిసే, కూకట్‌పల్లి తెలుగు తమ్ముళ్ళు.. ఇంత యాగీ చేస్తున్నారు.