హరీష్ కి షాకిచ్చిన కేటీఆర్… జగన్ కు థాంక్స్!

గతకొన్ని రోజులుగా తెలంగాణలో అధికారపార్టీ నేత మంత్రి హరీష్ రావు ఏపీ రాజకీయాలపై స్పందిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తున్నారు. జగన్ సర్కార్ ని గిల్లుతున్నారు. అనంతరం పేర్ని నాని లాంటి నాయకులతో రెండు వైపులా వాయించుకుని అక్షింతలు వేయించుకుంటున్నారు. ఈ సందర్భంగాలో బీఆరెస్స్ కీలక నేత మంత్రి కేటీఆర్.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు థాంక్స్ చెప్పారు.

అవును… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తెలంగాణ మంత్రి బీఆరెస్స్ కీలక నేత కల్వకుంట్ల తారక రామారావు ప్రశంసల వర్షం కురిపించారు. ఇదే సమయంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి సైతం కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ అవ్వగా… కొంతమంది నెటిజన్లు హరీష్ కు ఈ వీడియో బైట్లు షేర్ చేస్తున్నారు.

వివరాళ్లోకి వెళ్తే… తెలంగాణ రాష్ట్రంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పురాతన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి, ఎల్లారెడ్డి పేటలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ పునరుద్దరణ పనులకు తాజాగా కేటీఆర్, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. ఆ సమయం లో మంత్రి కేటీఆర్… సుబ్బారెడ్డి తో పాటు జగన్ మీద ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ సందర్భంగా… తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అత్యధిక తెలుగు ప్రజల ఆదరించే దేవాలయం అని.. మీరు కొంత డబ్బులు ఇస్తే తెలంగాణలో కూడా పురాతన ఆలయాలు మళ్లీ వెలుగుందుతాయని ప్రతిపాదిస్తే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా తెలంగాణ ఆలయాల అభివృద్ధికి జగన్ ఆమోదముద్ర వేశారని ఈ సందర్భంగా కేటీఆర్ వెల్లడించారు.

అనంతరం తెలుగు ప్రజలు ప్రాంతాలుగా విడిపోతున్నప్పటికీ.. ప్రజలుగా కలిసే ఉంటారన్న విషయం అప్పుడే చెప్పామని గుర్తు చేసిన కేటీఆర్… సుబ్బారెడ్డి గారు ఇక్కడికి రావడమే దానికి ఉదాహరణ పేర్కొన్నారు. దీంతో కేటీఆర్ చెప్పిన ఈ మాటలు హరీష్ రావు కు కూడా వినిపించాలని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.