కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ. రామారావు మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పోడు భూముల పట్టాల కోసం ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ గుండాగిరికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని దిందా గ్రామంలో పోడు భూముల రైతుల పక్షాన నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సహా పలువురు పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రైతుల చేతులకు సంకెళ్లు వేయడమే కాకుండా, వారికి అండగా నిలుస్తున్న వారిని అక్రమంగా నిర్బంధించడం దారుణమని అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని, ఈ ప్రభుత్వ పతనం దగ్గరలోనే ఉందని కేటీఆర్ జోస్యం చెప్పారు. పోడు రైతులను వేధించడం తక్షణమే ఆపి, వారికి పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కుట్రపూరితంగా అరెస్టులు చేయడాన్ని మానుకుని, కౌటాల పోలీసుల అదుపులో ఉన్న ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌తో పాటు ఇతర బీఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ అరెస్టులను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు కూడా ఖండించారు. పోడు రైతులకు మద్దతుగా నిలవడం తప్పా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల చేతులకు బేడీలు వేయడమేనా ఇందిరమ్మ రాజ్యం అని ఆయన విమర్శించారు.


