2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి ఓట్లు రాల్చిన పథకాల్లో రెండు అత్యంత కీలకమైనవి. ఒకటి కెజి టు పిజి ఉచిత నిర్బంధ విద్య అయితే రెండోది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. ఉచితంగానే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ఇస్తామని కేసిఆర్ నమ్మబలికారు. జనాలు ఓట్లు గుద్దుడు గద్దారు. అయితే ఆశించినంతగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టలేక చేతులెత్తేసింది తెలంగాణ సర్కారు. కనీసం 10 శాతం మందికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేకపోయింది. అసలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎందుకు ఇవ్వలేకపోయామో మంత్రి కేటిఆర్ తాజాగా వివరించారు. మరోవైపు కేసిఆర్ డబుల్ బెడ్రూమ్ వైఫల్యాలపై మాట్లాడకుండా విపక్షాలపై మాటలు తూటాలు పేలుస్తూ స్పీచ్ లు దంచి కొడుతున్నారు. వారిద్దరు ఏమంటున్నారో చదవండి.
గత ఎన్నికల్లో కేసిఆర్ తిరిగిన ప్రతి సభలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి మీ ఆత్మగౌరవం కాపాడతామని జనాలను నమ్మించారు. ప్రతి సభలో ‘‘అల్లుడు వస్తే ఏడ ఉండాలె? ఆడవాళ్లు ఎక్కడ చీర మార్చుకోవాలె? మేకలు ఏడ పండాలె?’’ అని జనాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మీద ఆశలు పెంచారు. అయితే ఆశించిన రీతిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేకపోయింది తెలంగాణ సర్కారు. ఎర్రవల్లిలో, హైదరాబాద్ చుట్టుముట్టు కొన్ని ఇండ్లు, ఖమ్మం జిల్లా కేంద్రంలో కొన్ని ఇండ్లు తప్ప కనీసం గ్రామానికి ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు టిఆర్ఎస్ సర్కారు.
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పై మంత్రి కేటిఆర్ వికారాబాద్ జిల్లాలో స్పందించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించడంలో ఆలస్యం అయిందని మంత్రి అంగీకరించారు. ఎందుకు జాప్యం అయిందో కూడా మంత్రి కేటిఆర్ వివరించారు. కొన్ని గ్రామాల్లో స్థలం లేకపోవడంతో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం షురూ చేయలేదని చెప్పారు. మరికొన్ని గ్రామాల్లో కాంట్రాక్టర్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టేందుకు ముందుకు రాలేదని తెలిపారు. ఈ రకమైన కారణాలతోనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను జనాలకు అందించలేకపోయినట్లు కేటిఆర్ వివరించారు.
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పథకంలో లోటుపాట్లు ఉన్నాయని మంత్రి కేటిఆర్ చెప్పారు. కానీ భవిష్యత్తులో సవరించుకుని ఈ పథకాన్ని వేగంగా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. రానున్న ప్రభుత్వంలో అర్హులైన వారు తమకు ఉన్న స్థలం చూపితే ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని మంత్రి కేటిఆర్ హామీ ఇచ్చారు.
ఇంకా కేటిఆర్ ఇతర అంశాలపైనా మాట్లాడారు. రైతు బంధు పథకం లాంటి స్కీమ్ అమలు చేయాలన్న ఆలోచన దేశంలో ఏ ముఖ్యమంత్రికి కానీ, ఏ ప్రధాన మంత్రికి కానీ రాలేదని చెప్పారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతులకు మేలు చేకూరిన రైతు బంధు పథకం విజయవంతమైందన్నారు.
మొత్తానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంలో టిఆర్ఎస్ సర్కారు అట్టర్ ఫ్లాఫ్ అయిందని కేటిఆర్ అంగీకరించారు. నాలుగున్నరేళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం అమలు చేయలేకపోయినట్లు అంగీకరించారు. రానున్న రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం విధానంలో మార్పులు తెస్తామన్నారు. సొంత జాగా ఉంటే ఐదు లక్షలు ఇస్తామని చెప్పారు. అయితే ఈ స్కీమ్ కాంగ్రెస్ ఇప్పటికే అనౌన్స్ చేసింది.
మరోవైపు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో సిఎం కేసిఆర్ మాత్రం ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రతిపక్షాలను తిట్టి పోస్తున్నారు. ఎదురుదాడి చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆసల్యమైనా పక్కాగా నిర్మిస్తామని, ప్రతిపక్ష నేతలు సన్నాసుల వలే మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. రెండు తరాలకు సరిపోయే విధంగా తాము డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నట్లు చెబుతున్నారు. రాత్రికి రాత్రే డబుల్ బెడ్రూమ్ ఇల్లేది అని విపక్షాలు విమర్శలు చేయడంలో అర్థం లేదని కేసిఆర్ పలు బహిరంగసభల్లో సమాధానమిస్తున్నారు.
మొత్తానికి టిఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో కేసిఆర్ విపక్షాలపై ఎదురుదాడి చేస్తుండగా కేటిఆర్ మాత్రం తాము వైపల్యం చెందామని, రానున్న రోజుల్లో కొత్త పద్ధతిలో అమలు చేస్తామని చెబుతున్న పరిస్థితి ఉంది.