బిగ్ బ్రేకింగ్ : కేటీఆర్ కు టిఆర్ఎస్ పార్టీ పగ్గాలు

తెలంగాణ సీఎం, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టిఆర్ఎస్ పార్టీ  వర్కింగ్ ప్రెసిండెంట్ (కార్యనిర్వాహక అధ్యక్షుడు)గా తనయుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే  కేటిఆర్ ను కేసీఆర్ నియమించారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ పరంగా నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు, ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్ధానాలను తు.చ. తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యతలు తనపై ఉన్న దృష్ట్యా, అత్యంత నమ్మకస్తుడు, సమర్ధుడికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని భావించిన కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

తెలంగాణ ఉద్యమానికి రాజకీయ వేదికను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని స్థాపించారు. టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని గమ్యానికి చేర్చి, ప్రత్యేక రాష్ట్రం సాధించింది. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన  టిఆర్ఎస్ పార్టీ,  బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా బలమైన అడుగులు వేసింది.  తెలంగాణ రాష్ట్రానికి టిఆర్ఎస్ మాత్రమే శ్రీరామ రక్ష అని ప్రజలు ఏకోన్ముఖంగా భావించి, ఇటీవల ఎన్నికల్లో తిరుగులేని విజయం అందించారు.

తెలంగాణ ప్రజలకు టిఆర్ఎస్ పార్టీపై అచంచల విశ్వాసం ఉంది. తెలంగాణ భవిష్యత్తుకు టిఆర్ఎస్ అత్యంత పటిష్టంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడం, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాల్సి ఉండడంతో కేసీఆర్ పై పనిభారం పెరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ పార్టీని తాను అనుకున్న విధంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యతను, పార్టీలో తాను అత్యంత ఎక్కువగా విశ్వసించే కేటీఆర్ కు కేసీఆర్ అప్పగించారు.

పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం, జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించడం, సంస్థాగతంగా తిరుగులేని శక్తిగా టిఆర్ఎస్ పార్టీని తీర్చిదిద్దే బాధ్యతలను కేటీఆర్ కు అప్పగించారు. భారతదేశంలోనే అతి గొప్ప పార్టీగా టిఆర్ఎస్ ను రూపుదిద్దాలనే సంకల్పంతో కేసీఆర్ ఉన్నారు. ఇప్పటి వరకు అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో ఇచ్చిన బాధ్యతలన్నీ అత్యంత విజయవంతంగా నిర్వహించిన కేటీఆర్ కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ నిర్ణయించారు. కేటీఆర్ పనితీరు, నిబద్ధత, దార్శనికత,నాయకత్వ లక్షణాలు టిఆర్ఎస్ పార్టీని సుస్థిరంగా, సుభిక్షంగా నిలుపుతాయని కేసీఆర్ విశ్వసిస్తున్నారు.

వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న కేటిఆర్ మంత్రి పదవి చేపడుతారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేబినేట్ విస్తరణ ఇంకా పూర్తి కాలేదు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కూడా కాలేదు. దీంతో నూతనంగా ఏర్పడబోయే కేబినేట్ లో కేటిఆర్ కు అత్యంత సన్నిహితులైన వారికే మంత్రి పదవులు దక్కుతాయన్న చర్చ జరుగుతోంది.  కేటిఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించిన కేసీఆర్ తర్వాత సీఎం పదవిని కూడా కట్టబెడుతారని చర్చ జరుగుతోంది. కేసీఆర్ ఇక పూర్తిగా హస్తిన రాజకీయాలకు పరిమితం కానున్నారని స్పష్టమవుతుంది. 

ఇటీవల ఆయన కొంత మంది జాతీయ నేతలను కలిశారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పార్టీల నాయకులను ఆయన కలవనున్నారు. నాన్ కాంగ్రెస్, నాన్ బిజెపి ప్రభుత్వాల ఏర్పాటు లక్ష్యంగానే ముందుకు కదులుతానని కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు తీసుకున్నాక కేటిఆర్ ముందు మొత్తం ఎన్నికల సమరమే ఉంది. పంచాయతీ ఎన్నికలు, సింగిల్ విండో, ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికలు ఉన్నాయి. వీటన్నింటిని కూడా కేటిఆర్ ఆధ్వర్యంలోనే టిఆర్ఎస్ ఎదుర్కోనుంది. 

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు గడవక ముందే కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకోవడంతో అంతా చర్చనీయాంశమైంది. కేటిఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పగించడంతో తర్వాత కాబోయే సీఎం కేటిఆరేనని కేసీఆర్ సిగ్నల్ ిఇచ్చారా అని పార్టీలో చర్చ మొదలైంది. పార్టీలో కీలకంగా ఉన్న హరీష్ రావును కాదని కేటిఆర్ కు పదవి కట్టబెట్టడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.