ఫామ్ హౌస్ లో పండేటోనికి ఓటెందుకు వేయాలె : కోదండరాం

హైదరాబాద్ మేడ్చల్ లో జరిగిన సోనియాగాంధీ బహిరంగసభలో తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడారు. కేసిఆర్ పాలన మీద నిప్పులు చెరిగారు. ప్రొఫెసర్ గా నిన్న మొన్నటి వరకు కొంత సౌమ్యంగా మాట్లాడిన కోదండరాం ఇప్పుడు మాటల్లో ఘాడత పెంచారు. ఫామ్ హౌస్ లో పండేటోడికి ఓటెందుకు వేయాలె? అని కేసిఆర్ ను ఉద్దేశించి నిలదీశారు. ఒకవైపు స్పీచ్ ముగించాలంటూ ఉత్తమ్, కోదండరాం దగ్గరకు వచ్చి స్పీచ్ ముగించాలంటూ సైగలు చేసినా పట్టించుకోలేదు కోదండరాం. తాను చెప్పాల్సిన విషయాలను సూటిగా సభలో ప్రసంగించారు. సభా వేదిక మీద సోనియాగాంధీ, రాహుల్ తో సహా అందరికంటే కోదండరామే ఎక్కువసేపు మాట్లాడారు. ఇక కాంగ్రెస్ నేతలు అందరూ అరకొర గానే మాట్లాడారు.  కోదండరాం ఇంకా ఏమేం మాట్లాడారో కింద ఆయన మాటల్లోనే చదవండి.

ఇంతకుముందే గద్దరన్న పోరు తెలంగాణమా అని పాట పాడిండు. ఈ సభకు వచ్ఆచిన  పోరు తెలంగాణ యోధులందరికీ నమస్కారం. మనం తెలంగాణ తెచ్చకుని నాలుగేళ్లు గడిచింది. ఆ తెలంగాణ ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోశించిన సోనియాగాంధీ కి కృతజతలు తెలియజేస్తున్నాను. ఆ రోజున ఎన్ని కష్టాలు ఎదురైనయో నాకు తెలుసు. ఆరోజు నేను ఢిల్లీలో ఉన్నాను. కష్టాలకు, నష్టాలకు ఓర్చి తెలంగాణ ఇచ్చిన వ్యక్తి సోనియాగాంధీ ఇక్కడికి రావడం, ఈ సభలో మాట్లాడే అవకాశం నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నాను.

నాలుగేండ్ల పాలన మీరందరు ఏం చూసిర్రో. ఎవరికి కూడా ఒక మంచైతే జరిగిందని చెప్పటానికి వీలు లేదు. ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. మూడెకరాల భూమి దక్కలే. మన పిల్లలెవరికీ ఉద్యోగాలు రాలే. పిల్లలు రాత్రంతా చదివిర్రు పాపం. ఐదు రూపాయల భోజనం తిని చదివిర్రు. చెట్ల కింద కూర్చుని నిద్ర పోకుండా చదివిర్రు. కానీ నోటిఫికేషన్లు వేయలేదు, వాళ్లకు ఉద్యోగాలు రాలే. లక్ష ఉద్యోగాలు ఖాళీ అన్నారు. 25వేలు కూడా నింపలే.

కనీస వేతనాలు పెరగలేదు. నాలుగున్నరేళ్లలో మద్దతు ధర అడిగినందుకు రైతులకు బేడీలు వేసిర్రు. ఇసుక మాఫియా ఆగడాలను ఎదుర్కొన్నందుకు, లారీలు ఆపినందుకు దళితులను విచ్చలవిడిగా కొట్టిర్రు. మీఅందరికీ తెలుసు. వాళ్లు నడవలేకుండా ఉన్నారు. రేషన్ డీలర్లు పడ్డటువంటి బాధలు అందరికీ తెలుసు. ఉద్యోగులు గౌరవప్రదమైన జీవితమే కోల్పోయిర్రు తెలంగాణల.  

రుణమాఫీ అయిందంటున్నారు. పైసలు పడ్డయంటున్నరు కానీ ఎకౌంట్ లో మాత్రం ఒక్క పైసా చేరలేదు. నల్లా ఇప్పి కింద రంద్రం ఉన్న కుండను పెడితే ఎట్లా కారిపోతాయో బ్యాంకులో వేసిన పైసలు కూడా అట్లే కారిపోయినయ్. ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్ కాలేదు. రెగ్యులరైజ్ కాలేదు. అందరికీ చేస్తామన్నారు కానీ చేయలేదు. వారికి కనీస వేతనాలు పెంచలేదు. 

అందరికీ టాక్స్ తగ్గించిండని ఆటోడ్రైవర్లు ఆనందపడ్డరు. కానీ ఇన్సూరెన్స్ పెంచి వాళ్ళ నడ్డీ విరిచిర్రు. విద్యార్థులకు ఫీజురీయంబర్స్ మెంట్ రాలేదు. గట్టిగా ప్రశ్నించినందుకు అరెస్టులు, మీద పడి కొట్టడాలు కూడా చేసిర్రు. ఆఖరికి ధర్నా చౌక మూసేసిర్రు. ఈ నాలుగున్నరేళ్ల పాలన నిరంకుశ పాలన. నియంత పాలన. ఈ నియంత పాలనకు చరమగీతం పాడేటందుకే అందరం ఏకమైనం. దాన్ని అంతం చేయడానికి మనకు సందర్భం వచ్చింది. 

మన అదుష్టం కొద్దీ కేసిఆర్ 9 నెలల ముందే మనకు అవకాశం ఇచ్చిర్రు. ఎన్నికలకు పిలుపునిచ్చిండు. ఇంటికి పోతా అని గద్దె దిగిపోయిండు. గద్దె దిగి ఇంటికి పోయినోళ్లకు ఓటు అడిగే హక్కులేదు. ఇంటికిపోయినోళ్లకు మల్లా ఓటేయాల్సిన అవసరం లేదు. అయినా నాకు ఓటేసినా మంచిదే ఓటేయకపోయినా మంచిదే అన్నారు కేసిఆర్. మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి. టిఆర్ఎస్ కు ఓటేసినా ఫామ్ హౌసే లోనే ఉంటడు. ఓటేయకపోయినా ఫామ్ హౌస్ లోనే ఉంటడు. ఎటుతిరిగి ఫామ్ హౌస్ లో పండేటోడికి ఓటేయడం ఎందుకు దండగ.అటువంటోడికి ఓటు వేస్తే మురిగిపోయినట్లే లెక్క. టిఆర్అంఎస్ కు వేసిన ప్రతి ఓటు బురద గుంటలో వేసినట్లే లెక్క. అందుకోసమే కేసిఆర్ కు ఓటు వేయొద్దు. 

 ఇప్పుడు మేమంతా కలిసి ఒక ప్రజా కూటమిగా ఏర్పడ్డాము. ఎందుకు ఒక్కటైర్రు అని అడుగుతున్నరు. నిరంకుశ పాలనకు సమాధి కట్టాలని సర్వ శక్తులు కోరుతున్నాయి. అందుకే ఒక్కటైనం. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే కాదు. మనం కోరుకున్న తెలంగాణను నిర్మించుకోవాలని మాకు లక్ష్యం ఉంది. మనకు న్యాయం దక్కలేదు. ఇయ్యాల సమయం వచ్చింది. ప్రభుత్వంలో ప్రతి పైసాలో మనకు వాటా దక్కాలి. రైతులు బాగుపడాలి. విద్యార్థులకు కొలువులు రావాలె. నిరుద్యోగులకు న్యాయం జరగాలి. 

వచ్చిన తెలంగాణ నాలుగేళ్ల టిఆర్ఎస్ పాలన కాంట్రాక్టర్ల చేతుల్లోకి పోయింది. సమయం వచ్చింది కాబట్టి ఇపుడు నిర్ణయం  తీసుకోవాలి. ప్రభుత్వంలో ఖాళీలన్నీ భర్తీ కావాలి. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగాలి. కాంట్రాక్టు , ఔట్ ఉద్యోగులకు న్యాయం రావాలి. ప్రభుత్వ్ ఉద్యోగులకు గౌరవం పెరగాలి. ప్రతి ఒక్కరికి జీవనాధారం రావాలి. కూటమి కోరేది అదే.

జర్నలిస్టులకు ఇంటి సౌకర్యం లేదు. ఇస్తామని ఆశ పెట్టి మోసం చేసిండు. లాయర్లకు భద్రత లేదు. జర్నలిస్టులకు, లాయర్లకు న్యాయం జరగాలే. అందరం కలిసి నిలబడదాం. మేము సంఘటితంగా బయలుదేరినం. టిఆర్ఎస్ కోట్ల రూపాయలు వెదలజల్లుతున్నది. మీ అందరికి ఒక్కటే చెబుతున్నా. మా దగ్గర అంత డబ్బు లేవు. మీకు శ్రీకృష్ణ తులాభారం కథ చెప్పి ముగిస్తా.

శ్రీకృష్ణుడు తులాభారం వేస్తరు. ఎవరు తూకం వేసి గెలిస్తే వాళ్లకే శ్రీకుష్ణుడు అని నారదుడు వచ్చి చెప్తడు. వెంటనే సత్యభామ వస్తది. తన వద్ద ఉన్న సొమ్ములన్నీ కుమ్మరిస్తది. అహంభావి కదా? ఆమె సొమ్ములు కుమ్మరిస్తది  కానీ కృష్ణుడు తూగడు. అలిసిపోయి సత్యభామ ఓటమిని అంగీకరిస్తది. ఆఖరికి రుక్మిణి దేవీ వస్తది. కండ్లకు అద్దుకుని తులసీదళం వేస్తది. శ్రీకృష్ణుడిని గెలుసుకుని వెళ్లిపోతది. డబ్బుతో కొనలేనిది ప్రేమతో వేసిన తులసిదళమే మనల్ని నిలబెడుతుంది. మాకు ఇవ్వడానికి డబ్బు లేదు. కానీ డబ్బులతో శ్రీకుష్డుడే తూగలేదు. ప్రజలు డబ్బులకు వింటారని అనుకోవద్దు. మేము మీకోసం పనిచేస్తాం. మీ కోసం నిలబడతాం. మీకు ఒక మార్గం ఉందని స్పష్టం చేయదలిచాము. ఇయాల పర్వదినం. ఈ మధ్య వరుసగా పర్వదినాలే వస్తున్నాయి. పర్వదినం సందర్భంగా ఈ సభ ఇంకో పర్వదినం లాంటిది. అనుమానం అవసరం లేదు. ఆయన ఫామ్ హౌస్ కు వెళ్లిపోతున్నడు. మన తోవ మనం చూసుకోవాలె. మనం రాచబాటలో నడుద్దాం. రాజ్యాధికారం చేజిక్కంచుకోవాలని కోరతున్నా. జై తెలంగా.