బీఆర్ఎస్‌లో కవిత కీలక పాత్ర.! కేటీయార్ పరిస్థితేంటి.?

కేసీయార్ దేశ్ కా నేతా అవబోతున్నారు. జాతీయ పార్టీ వ్యవహారాల్ని తండ్రితో కలిసి తనయ కవిత చూసుకోనున్నారు. మరి, తనయుడు కేటీయార్ పరిస్థితేంటి.? తెలంగాణ రాజకీయాల్లో ఈ విషయమై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

తెలంగాణ రాష్ట్ర సమితిలో పవర్ సెంటర్ అంటే అది కేసీయార్ మాత్రమే. ఆ తర్వాతి స్థానం కోసం కేటీయార్, కవిత, హరీష్ రావు పోటీ పడుతున్నారంటూ గతంలో ప్రచారం జరిగింది. ఈ మేరకు పెద్ద యాగీ కూడా చూశాం. కాలక్రమంలో హరీష్ రావు ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్ర సమితిలో తగ్గుతూ వచ్చింది. కవిత కూడా మూడో ప్లేస్‌లోకి వెళ్ళిపోగా, రెండో స్థానం కేటీయార్ దక్కించుకున్నారు.

ఇప్పుడు రాజకీయం మారింది. పార్టీ పేరు, జెండా కూడా మారాయ్. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా.. భారత్ రాష్ట్ర సమితి అయ్యింది. ఇంతకీ, ఆ పార్టీకి ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు.? ఇంకెవరు కేటీయార్ మాత్రమే. కానీ, ఆయన తెలంగాణ రాజకీయాలకే పరిమితం.

బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీయార్.! బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కవిత వుంటారా.? అదే జరగొచ్చు. కేశవరావు లాంటి నేతలు టీఆర్ఎస్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నా, వారిది నామమాత్రపు పాత్రే. హరీష్ రావు సంగతేంటి.? అదైతే ప్రస్తుతానికి మిలియన్ డాలర్ క్వశ్చన్.

తెలంగాణ బాధ్యతల్ని పూర్తిగా కేటీయార్‌కే అప్పగిస్తారు కేసీయార్.. అన్నది పాత విషయమే. ఇందులో కొత్తదనమేమీ లేదు. బీఆర్ఎస్ స్థాపన వ్యవహారాల్లో కేటీయార్ కంటే కవిత ఎక్కువ కన్పించారు. ఢిల్లీలోనూ కవిత హంగామానే బీఆర్ఎస్ తరఫున నడుస్తోంది. ఇదంతా ముందే ఊహించిన బీజేపీ, వ్యూహాత్మకంగా కవితని ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇరికించిందన్న అనుమానాలు లేకపోలేదు.