షాకింగ్ న్యూస్ : కేసిఆర్ పెట్టిన చీరె గయబ్ అయింది

దేవుడి మీద విశ్వాసం, భక్తి శ్రద్ధలు ఉన్నవారికి ఇది షాకింగ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద షాకింగ్ న్యూసే. భక్తజనులే కాదు.. సామన్య మానవులకు కూడా ఆశ్చర్యం కలిగించే వార్తనే. దేవాలయాల్లో సిబ్బంది తీరు ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఈ ఘటన అద్దం పడుతున్నది. ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తన మొక్కు తీర్చుకున్న నేపథ్యంలో అమ్మవారికి సమర్పించిన చీరే మాయం కావడం భూపాలపల్లి జిల్లాలో కలకలం రేపింది. ఇంతకూ ఈ షాకింగ్ న్యూస్ ఏంటనుకుంటున్నారా? అయితే చదవండి.

తెలంగాణ వస్తే తిరుపతి ఎంకన్నను వజ్రకిరీటం, బెజవాడ కనకదుర్గమ్మ కు వజ్రాలు పొదిగిన ముక్కు పుడక, కొరివి మల్లన్నకు వెండి మీసాలు సమర్పిస్తానని మొక్కుకున్నారు అప్పటి ఉద్యమ నేత కేసిఆర్. అంతేకాదు ఇంకా తెలంగాణలోని దేవాలయాల్లోనూ మొక్కులు మొక్కారు. షాద్ నగర్ వద్ద దర్గాలో కూడా మొక్కులు చెల్లించుకుంటానని మొక్కుకున్నారు. కాలేశ్వరం ముక్తేశ్వరం దేవాలయాన్ని సందర్శించి అక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటానని వేడుకున్నారు.

ఆయన కోరిక ఫలించింది. కోరిన తెలంగాణ రాష్ట్రం వచ్చుడే కాదు.. ఏకంగా ఆయనే ముఖ్యమంత్రి అయిపోయారు కూడా. దీంతో మొక్కులు చెల్లించే కార్యక్రమం కూడా షురూ చేశారు. ఇప్పటికే మొక్కులు చెల్లింపు కార్యక్రమాలు ముగింపు దశకు వచ్చాయి. తిరుపతి ఎంకన్నకు, బెజవాడ కనకదుర్గమ్మతోపాలు తెలంగాణ ఆలయాల్లో కూడా మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మొక్కులు వ్యక్తిగతమైనవా? ప్రజా ధనం వినియోగించి మొక్కులు చెల్లించుకోవడం తుగనా అన్న విమర్శలు వచ్చాయి.. దానిపై హైకోర్టులో కేసు కూడా నడుస్తోంది. కొద్దిసేపు ఆ వివాదాన్ని పక్కనపెడదాం.

తెలంగాణ వచ్చిన తొలినాళ్లలో భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ముక్తేశ్వరం దేవాలయాన్ని సందర్శించుకున్నారు కేసిఆర్. అక్కడ అమ్మవారికి ఆయన చీరె సమర్పించారు. ఏకంగా ముఖ్యమంత్రివర్యులే స్వయంగా వచ్చి అమ్మవారికి చీరె సమర్పించారంటే అది మామూలు చీర కాదని మనకు తెలియంది కాదు. చాలా ఖరీదైన చీరే అయి ఉంటది కదా? అయితే ఆ చీరె ఇప్పుడు మాయమైపోయింది. ఎవరు మాయం చేశారన్నది తేలలేదు. దీనిపై ఇప్పుడు తీవ్ర గందరగోళం నెలకొంది.

కాళేశ్వరం ముక్తేశ్వరం దేవాలయానికి ఇటీవల కొత్త పాలకమండలి కొలువుదీరింది. దీంతో చీరె మాయమైపోయిన విషయాన్ని గుర్తించింది దేవాలయ కమిటీ. దీంతో సిఎం పెట్టిన చీరే ఏమైందని దేవాలయ సిబ్బందిని నిలదీశారు  పాలకమండలి సభ్యులు. దీంతో వారు నీళ్లు నమిలారు. అంతేకాదు ఆ చీరె మాయమైపోయిందని సమాధానమివ్వడంతోపాటు తామంతా నపరిన్ని డబ్బులు జమ చేసి ఇంకో చీరె కొనుక్కొచ్చి అమ్మవారిని అలంకరించామని వారు చెప్పారు. మొత్తం 2500 రూపాయలు జమ చేసి నకిలీ చీరె కొనుక్కొచ్చి అమ్మవారిని అలంకరించినట్లు తెలిపారు.

దీంతో దేవాలయ పాలకమండలి అగ్గి మీద గుగ్గిలమైంది. ఏకంగా ముఖ్యమంత్రి పెట్టిన చీరె మాయమైపోతే ఇక సామాన్య భక్తులు ఇచ్చే కానుకలకు భద్రత ఉంటదా అని వారు నిలదీశారు. ఇప్పుడు ఈ అంశం భూపాలపల్లి జిల్లాలోనే కాకుండా తెలంగాణ అంతటా హాట్ టాపిక్ అయింది. మరి దీనిపై సర్కారు ఏరకంగా స్పందిస్తుందో చూడాలి.