మోడీ సభలో కేసీఆర్.. @ 7 మినిట్స్?

ఇంతకాలం స్థబ్ధగా ఉన్నట్లు కనిపించిన తెలంగాణ రాజకీయాలు.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత ఈడీ విచారణను ఎదుర్కొంటున్నప్పటినుంచీ హాట్ హాట్ గా మారిపోయాయి. ప్రతీరోజూ ఏదో ఒక ఇష్యూ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. నిన్నమొన్నటివరకూ టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం.. ఇప్పుడు టెన్త్ క్లాస్ క్వశ్చన్ పేపర్స్ పంచాయతీ.. అందులో బండి అరెస్టు.. సరిగ్గా అదే సమయానికి మోడీ రాక!

అవును… ప్రస్తుతం తెలంగాణలో సంజయ్ అరెస్టు – హైదరాబాద్ కు మోడీ రాక చుట్టునే రాజకీయాలు నడుస్తున్నాయి. నిన్నమొన్నటివరకూ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉన్న టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారాన్ని వ్యూహాత్మకంగా సైడ్ ట్రాక్ ఎక్కించి.. బండి సంజయ్ అరెస్టుతో పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ ను మరింత వ్యూహాత్మకంగా మెయిన్ ట్రాక్ లోకి తీసుకురావడంలో బీఆరెస్స్ నేతలు సక్సెస్ అయ్యారని కామెంట్లు వినిపిస్తున్న తరుణంలో… మోడీ హైదరాబాద్ కి వస్తున్నారు.

కోర్టు రెండు వారాలు రిమాండ్ విధించడంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రస్తుతం కరీంనగర్ జైల్లో ఉండగా.. మరో మూడురోజుల్లో మోడీ హైదరాబాద్ కు వస్తున్నారు. సరిగ్గా మోడీ వస్తున్న సమయం చూసి బండిని తెలంగాణ సర్కార్ లోపల వేయడం.. దీంతో బీజేపీ శ్రేణులు ఫుల్ కాకమీదుండటం.. ఇదే సమయంలో మోడీ హైదరాబాద్ రానుండటంతో సీఎం హోదాలో కేసీఆర్ ఎదురెళ్లి స్వాగతం పలుకుతారా? లైట్ పట్టించుకోకుండా ఉంటారా? అన్న అంశం కూడా తదనుగుణంగా చర్చనీయాంశం అయ్యింది.

ఫలితంగా… ప్రోటోకాల్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. అవును… ఈ నెల 8న హైదరాబాద్‎ కు ప్రధాని మోడీ రానున్న నేపథ్యంలో అదే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వస్తారా.. లేదా అనేది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ కు ఇప్పటికే ఆహ్వానాన్ని పంపినట్లు తెలిపారు.

ఒకవేళ మోడీకి స్వాగతం పలకడానికి కేసీఆర్ వస్తే.. బహిరంగ సభకు హాజరై తెలంగాణాకు రావాల్సిన నిధులపైనా ప్రసంగించాలని భావిస్తే… అందుకు కూడా కేసీఆర్ కోసం సమయం కేటాయించారు బీజేపీ నేతలు. అవును… శనివారం హైదరాబాద్‎ కు రానున్న భారత ప్రధాని.. పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అయితే ఈ “ప్రధాని సభలో సీఎం మాట్లాడేందుకు” ఏడు నిమిషాల సమయం కేటాయించినట్లు తెలుస్తోంది.

కాగా, ఇప్పటికే తెలంగాణలో మోడీ పర్యటించినప్పుడల్లా సీఎం కేసీఆర్ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామంతో సర్వత్రా విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ప్రధానికి స్వాగతం పలికే సాంప్రదాయాన్ని రాష్ట్రం ప్రభుత్వం, కేసీఆర్ విస్మరిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తుంది. అయితే… ఈసారి కూడా మోదీకి స్వాగతం పలికేందుకు కేసీఆర్ రాకపోవచ్చనే అంటున్నారు.