హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ అంశంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రగతిభవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీతో సమీక్ష నిర్వహించారు. సీఆర్ బిస్వాల్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర తొలి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) గత నెల 31న సీఎస్ సోమేశ్‌కుమార్‌కు పీఆర్సీ నివేదికను సమర్పించిన విషయం తెలిసిందే. సీల్డ్కవర్లో ఉన్న ఈ నివేదికతో సీఎస్.. ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లి చర్చించినట్టు తెలిసింది. సీఎం సమక్షంలో ఈ నివేదికను తెరిచి అధ్యయనం జరిపినట్టు సమాచారం.. గత నెల 31న సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన మేరకు.. ఈ నెల 6, 7 తేదీల్లో ఉద్యోగ సంఘాలతో పీఆర్సీ అమలుపై సీఎస్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సమావేశమై చర్చలు జరపాల్సి ఉంది.
ఉద్యోగ సంఘాలతో సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని సీఎం కేసీఆర్ ఈ సమావేశంలో సీఎస్‌కు వివరించినట్టు తెలిసింది. ఇటు బుధవారం జరగాల్సిన సమావేశానికి సంబంధించి సీఎస్ నేతృత్వంలోని కమిటీ నుంచి తమకు ఇంకా ఎలాంటి ఆహ్వానం అందలేదని ఉద్యోగ సంఘాల నాయకులు మంగళవారం రాత్రి మీడియాకు తెలియజేశారు. బుధవారం పిలుపు రావచ్చని ఆశాభావంతో ఉద్యోగ సంఘాల నేతలున్నారు. సీఎంతో జరిగిన భేటీలో ఉన్నత స్థాయి కమిటీ సభ్యులు ఆర్థిక, నీటిపారుదల శాఖల ముఖ్య కార్యదర్శులు కె.రామకృష్ణారావు, రజత్‌కుమార్ పాల్గొన్నట్టు తెలిసింది.ఏపీలో పనిచేస్తున్న 654 మంది తెలంగాణ ప్రాంత ఉద్యోగులను సొంత రాష్ట్రం తెలంగాణకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనలకు సంబంధించిన ఫైల్ మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చేరిందని అధికార వర్గాలు తెలిపాయి. సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే రెండు మూడ్రోజుల్లోగా ఉత్తర్వులు రావచ్చని ఉద్యోగ సంఘాల నేతలు భావిస్తున్నారు.