నేను నిన్ను తిట్టను… నువ్వు నన్ను కొట్టకు!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయాలు తెగ మరిపోతున్నాయి. ఎవరి వ్యూహాలు ఏమిటి.. ఇంకెవరి ప్రతివ్యూహాలు ఏమిటి అనే విషయంపై సందిగ్దతలు నలకొన్నప్పటికీ… బీఆరెస్స్ – బీజేపీల లెక్కలు మాత్రం తెరపైకి వస్తున్నాయి. దీంతో రకరకాల విశ్లేషణలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే గత రెండు మూడు రోజులుగా బీజేపీ – బీఆరెస్స్ ల మధ్య జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలించినవారికి మాత్రం ఒక క్లారిటీ వస్తుంది.

తాజాగా జరిగిన బీఆరెస్స్ మహాసభలో మైకందుకున్న కేసీఆర్… కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలపాలి అని అన్నారు. ఆ పార్టీ గతంలో తెలంగాణకు చేసిందేమీ లేదని దుబ్బయట్టారు. ఇక టి.కాంగ్రెస్ నేతలపై వరుసపెట్టి విమర్శలు చేశారు! అయితే కాంగ్రెస్ పై సంధించిన వంద విమర్శనాస్త్రాల్లో ఒక్కటికూడా బీజేపీపై సంధించలేదు కేసీఆర్. దీంతో… బీఇజేపీ విషయంలో కేసీఆర్ తగ్గారా – తగ్గాల్సి వచ్చిందా అనే చర్చ తెరపైకి వచ్చింది.

అయితే తాజాగా కేసీఆర్ వైఖరికి అనుబంధంగా తెలంగాణ బీజేపీ నేతలు కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాంగా… రాష్ట్ర ప్రభుత్వం 21 రోజులపాటు నిర్వహిస్తున్న అధికార కార్యక్రమాలకు వ్యతిరేకంగా కేసీఆర్‌ సర్కార్‌ తీరును “రివర్స్‌ గేర్‌” నిరసనలతో ఎండగట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది! ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్!

అవును… బీఆరెస్స్ సర్కార్‌ దశాబ్ది ఉత్సవాలకు కౌంటర్‌ గా “రివర్స్‌ గేర్‌” కార్యక్రమాలు నిర్వహించాలనే యోచనను కమలదళం విరమించుకుంది. మోడీ ప్రభుత్వ తొమ్మిదేళ్ల పాలనపై నిర్వహిస్తున్న “మహా జనసంపర్క్‌ అభియాన్‌”లో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలపైనే ప్రజల్లోకి వెళ్లాలని… కేసీఆర్ సర్కార్ పై విమర్శలపై దృష్టి పెట్టొద్దని సూచించినట్టు తెలుస్తోంది!

దీంతో బీఆరెస్స్ పై “రివర్స్‌ గేర్‌” కార్యక్రమాలు రద్దయినట్టు సమాచారం. అయితే ఈ విషయాలపై పూర్తి వివరణ ఇవ్వడానికి తెలంగాణ బీజేపీ నేతలు మీడియాకు ముఖం చాటేస్తున్నారని తెలుసుంది. ఫలితంగా కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలకు బలం చేకూరుతుందని అంటున్నారు పరిశీలకులు.

మైకందుకున్న ప్రతీసారీ…. “బీఆరెస్స్ – బీజేపీలు గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ” అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్‌ నేతలు నిత్యం విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో… తాజా పరిణామాలు ఆ విమర్శలకు ఊతమిచ్చేవిగా ఉన్నాయని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.