అది 2001 సమయం. ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కొందరు జోక్ చేశారు. మరికొందరు జోకర్ అనుకున్నారు, అన్నారు. కానీ పుష్కర కాలం వెనుదిరిగి చూడలేదు. వెక్కిరింపులు, ఈసడింపులు, తిట్లు, షాపనార్థాలు ఇవేవీ పట్టించుకోలేదు. తన ఆశయ సాధన కోసం యావత్ జాతిని ఏకం చేసిండు. అంతిమంగా తెలంగాణ రాష్ట్రం సాధించిండు కేసిఆర్. ఎవరు అవునన్నా… ఎవరు కాదన్నా తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసిఆర్ పాత్రే కీలకం. కేసిఆర్ టిఆర్ఎస్ పార్టీ పెట్టకముందు పార్టీ పెట్టిన తర్వాత ఎంతో మంది పార్టీలు, ఫ్రంట్ లు గట్రా పెట్టిర్రు. కానీ ఎవరూ నిలబడేలకపోయారు కేసిఆర్ తప్ప. నవ్విన నాపచేనే పండిందంటారు. కేసిఆర్ ను చూసి నవ్వినవాళ్లే ముక్కు మీద వేలేసుకునేలా చేశారు ఆయన. కలలో కూడా ఊహించడం కష్టమైన తెలంగాణ రాష్ట్రం నిజంగానే సాకారమైంది. తెలంగాణ సాధన కేసిఆర్ హస్తిన మీద తొలి దండ్రయాత్ర అయితే ఇప్పుడు హస్తినపై మరో దండయాత్రకు శ్రీకారం చుట్టారు. అదే ఫెడరల్ ఫ్రంట్. దీనిపైనా టిఆర్ఎస్ పార్టీ మొదలైన నాటి పరిణామాలే రిపీట్ అవుతున్నాయి.
తెలంగాణ సిఎం కేసిఆర్ గత నాలుగైదు నెలలుగా ఫెడరల్ ఫ్రంట్ పేరుతో హడావిడి చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనేవి ఏవైతే ట్యాగ్ లైన్ గా ఉన్నాయో నేడు కేసిఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ కు ‘‘దేశంలో గుణాత్మక మార్పు’’ అనే ట్యాగ్ లైన్ ఎంచుకున్నారు. ఈ పేరుతో ఒడిషా సిఎం నవీన్ పట్నాయక్ తో రెండుసార్లు భేటీ అయ్యారు. పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీతో రెండుసార్లు భేటీ అయ్యారు. కర్ణాటక సిఎం కుమారస్వామి తో ఒకసారి భేటీ అయ్యారు. తమిళనాడులో ప్రతిపక్ష నేత స్టాలిన్ ను సయితం కలిశారు. ఇంకా మరింత మందిని కలుస్తున్నారు.. కలవబోతున్నారు. వారంతా ఇప్పటికిప్పుడు కేసిఆర్ వెంట పరుగులు తీస్తారా? అనేది చెప్పడం కష్టం. కానీ కేసిఆర్ తన ప్రయత్నాలను మాత్రం సిన్సియర్ గా చేస్తున్నారు.
ముందస్తు ఎన్నికలకు, ఎన్నికల తర్వాత పరిణామాలు చూస్తే దేశవ్యాప్తంగా కేసిఆర్ ప్రతిష్ట మాత్రం పెరిగిందనే చెప్పాలి. ముందస్తు ఎన్నికల ముందు కేసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడితే అందరూ లైట్ తీసుకున్నారు. కొడుకును సిఎం కుర్చీ మీద కూసోబెట్టేందుకు ఫ్రంట్ రాజకీయానికి కేసిఆర్ తెర లేపాడని విమర్శకులు మాట్లాడారు. కానీ వ్యూహాత్మకంగా ముందస్తు ఎన్నికలకు పోయిన కేసిఆర్ 88 సీట్లతో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. దీంతో జాతీయ స్థాయిలో కేసిఆర్ పలుకుబడి అమంతంగా పెరిగింది.
తెలంగాణ ముందస్తుతో కేసిఆర్ దశ మారిందా?
ఎన్నికలకు ముందు నవీన్ పట్నాయక్ కానీ, మమతాబెనర్జీ కానీ కేసిఆర్ ఫ్రంట్ గురించి పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. నవీన్ పట్నాయక్ కు నేషనల్ ఫ్రంట్ తో ఆనాడు అవసరం లేదు.. రేపు కూడా అవసరం పడకపోవచ్చు. కానీ తొలిసారి కేసిఆర్ కలవగానే ఫ్రంట్ గురించి తామేమీ డిస్కస్ చేయలేదని మీడియా ముందుకొచ్చి చెప్పారు. అలాగే మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ లేని ఫ్రంట్ సాధ్యం కాదన్నారు. బిజెపి వ్యతిరేక ఫ్రంట్ కు తాను రెడీ అన్నట్లు చెప్పుకొచ్చారు. కానీ ముందస్తు ఎన్నికలవేళ ఇంట గెలిచారు కేసిఆర్. ఇప్పుడు ఆయన మాటకు జాతీయ స్థాయిలో మరింత పలుకుబడి ఉండే చాన్స్ ఉంది. నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ లాంటి నాయకులు ఇప్పుడు కచ్చితంగా కేసిఆర్ ప్రతిపాదిత ఫ్రంట్ మీద ఆలోచన చేయాల్సిన అనివార్యతను కేసిఆర్ సృస్టించగలిగారు.
తెలంగాణ కోసం ఉద్యమ కాలంలో తెలంగాణ ఇవ్వక తప్పని అనివార్యతను ఏ విధంగా అయితే సృష్టించగలిగారో ఇప్పుడు కూడా అదేబాటలో జాతీయ స్థాయిలో నాన్ కాంగ్రెస్, నాన్ బిజెపి ఫ్రంట్ విషయంలో ఒక ఆలోచనను దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు రగిలించగలిగారని చెప్పవచ్చు. ఇదే వరవడిని మరింత ముందుకు తీసుకుపోవడం కోసం కేసిఆర్ ఏకంగా నెలరోజులపాటు ప్రత్యేక విమానాన్ని బుక్ చేసుకున్నారు. స్వకార్యం, స్వామి కార్యం అన్నట్లు కుటుంబంతో కలిసి దేవుండ్లకు మొక్కులు మొక్కుతూనే వివిధ పార్టీల నాయకులతో మంతనాలు సాగిస్తున్నారు.
తెలంగాణ కోసం టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటైనప్పుడు తెలంగాణ వస్తుందంటే ఎవరూ నమ్మలేదని, కానీ తెలంగాణ వచ్చింది కదా? ఇప్పుడు ఫ్రంట్ విషయంలో కూడా విమర్శలు వస్తున్నాయని, కానీ వాటిని కేసిఆర్ పటాపంచలు చేసి ఢిల్లీ గద్దె మీద ఫెడరల్ ఫ్రంట్ సర్కారు కొలువుదీరడం ఖాయం అని టిఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సమకాలీన రాజకీయాల్లో ప్రజా నాడి పసిగట్టడంలో కేసిఆర్ ను మించిన నాయకుడే లేడని వారు గర్వంగా చెబుతున్నారు. ప్రజా నాడికి అనుగుణంగానే ముదస్తు ఎన్నికలకు వెళ్లి ప్రతిపక్షాలను తుత్తునియలు చేసిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రావడం ఖాయం, కేసిఆర్ ప్రధానమంత్రి కావడం కూడా కావడం ఖాయమే అని టిఆర్ఎస్ నేతలు బలంగా నమ్ముతున్నారు. అందుకోసమే కొందరు ఎమ్మెల్యేలు కేటిఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలంటూ ఓపెన్ గానే మాట్లాడుతున్నారు. రెండు పార్లమెంటు సీట్లు ఉన్న నాడే దేశాన్ని ఒప్పించి తెలంగాణ సాధించిన కేసిఆర్ ఇప్పుడు 16 సీట్లతో ప్రధాని పదవి చేపట్టడం పెద్ద కష్టమా అని వారు ప్రశ్నిస్తున్నారు.
ఉత్తరాది పెత్తనంపై దండయాత్ర
దేశంలో ఉత్తరాది రాష్ట్రాల పెత్తనమే ఢిల్లీలో ఎక్కువగా నడుస్తది. కేంద్రంలో వారి పలుకుబడి ముందు దక్షిణాది రాష్ట్రాలు దిగదుడుపే అన్న విమర్శ ఎప్పటినుంచో ఉంది. ఈ వాతావరణం గుర్తు పట్టే సినీ నటుడు పవన్ కళ్యాణ్ కూడా ఉత్తరాది రాష్ట్రాల పెత్తనంపై పోరాటం చేయడానికి సన్నద్ధమైన వాతావరణం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో 70 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో దక్షిణాది రాష్ట్రాల వారు ప్రధానులు మోతాదు సంఖ్యలోనే అయ్యారు. ఒకవేళ అయినా నిలబడలేకపోయారు. ఈ పరిస్థితుల్లో దక్షిణాది నాయకుడైన కేసిఆర్ తన మంత్రిశక్తితో మిగిలిన చిన్నా చితక పార్టీలను కలిపే ప్రయత్నం చేయడం ఆసక్తికరమైన అంశంగానే చెప్పవచ్చు. పివి నర్సింహ్మారావు, దేవేగౌడ లాంటివాళ్లు ప్రధాని పదవిలో కూర్చున్నా పెత్తనం మాత్రం చెలాయించింది ఉత్తరాది వారే. చంద్రబాబుకు ఒకసారి ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా అప్పుడు తాను తీసుకోలేదని అంటుంటారు. ఇప్పుడు ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలిచ్చిన బలంతో కేసిఆర్ జాతీయ నేత స్టేచర్ సంపాదించుకున్నారు.
మరి ఆ మచ్చల మాటేమిటి?
తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కేసిఆర్ 119 సీట్లకు గాను 88 సీట్లలో గెలవొచ్చు. జనాల ఆమోదం ఉండొచ్చు. అంతమాత్రాన ఆయన పాలన అంతా ప్రజాస్వామ్యబద్ధమేనా అంటే కాదనే అంటారు. అంత మెజార్టీ వచ్చినా మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ కు పదును పెట్టడం, కాంగ్రెస్ పార్టీని మండలిలో టిఆర్ఎస్ లో విలీనం చేసుకోవడం, అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా దక్కకుండా చేయాలనుకోవడం ఇవన్నీ ప్రజాస్వామ్యాన్ని కాలరాచే విధానాలే. కేసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ స్థాయిలో తన మంచిమాత్రమే చెప్పుకుంటున్నారు. కానీ ఈ వ్యవహారాన్ని కూడా అక్కడి పార్టీల నేతలు ఆరా తీయరన్న గ్యారెంటీ లేదు. పైగా సచివాలయానికి రాకుండా పాలన సాగించడం, కీలక పదవులన్నీ కుటుంబ సభ్యులకు పంచిపెట్టడం, రాగ ద్వేషాలకు అతీతంగా కాకుండా రాగ ద్వేషాలతో, బంధు ప్రీతితో పాలన సాగించడం లాంటివన్నీ జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కాకమానవు. ప్రశ్నించే గొంతులను నొక్కేసే ప్రయత్నం చేయడం, బలహీనులపై దండయాత్ర చేసినట్లుగా ప్రవర్తించడం, ధర్నాచౌక్ మూసివేయడం లాంటి చర్యలు కేసిఆర్ కు జాతీయ స్థాయిలో ప్రతిష్టను మరింతగా పెంచే చర్యలు అని టిఆర్ఎస్ నేతలు కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ విమర్శలు లేకుండా కేసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ యాత్ర చేస్తే మంచిదని సామాన్య జనాల అభిప్రాయం.