కేసిఆర్ తొలి అధికారిక పర్యటన వాయిదా

తెలంగాణలో ఘన విజయం సాధించిన కేసిఆర్ వెనువెంటనే సిఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు మరో మంత్రి మహమూద్ అలీ ఇద్దరే ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత తన తనయుడు కేటిఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ గా నియమించారు. 

ఇక పార్టీ కార్యక్రమాలు, పార్టీ మంచి చెడ్డలన్నీ కేటిఆర్ కు అప్పగించిన వెంటనే కేసిఆర్ పాలనపై దృష్టి కేంద్రీకరించారు. వరుస సమీక్షలతో పెండింగ్ అంశాలను క్లియర్ చేసే పనిలో పడ్డారు. సిఎం అయిన వెంటనే ప్రాజెక్టులపై సమీక్షలు చేపట్టారు. అధికారులపై సీరియస్ అయ్యారు. పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశాలిచ్చారు.

మరుసటిరోజు పంచాయతీరాజ్ శాఖపై సుదీర్ఘ సమీక్ష జరిపారు. పంచాయతీరాజ్ ఎన్నికల డెడ్ లైన్ సమీపిస్తుున్నవేళ ఎన్నికల ఏర్పాట్ల పైనా సమీక్ష జరిపారు. అలాగే పంచాయతీరాజ్ శాఖలో సెక్రటరీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. 57 ఏండ్లకే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో దానిపై కసరత్తు జరిపారు. వచ్చే ఏప్రిల్ నుంచి అర్హులైన వారందరికీ 2016 రూపాయల పెన్షన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 

ఇక ఈ నేపథ్యంలో ఈనెల 18వ తేదీన సిఎం కేసిఆర్ గా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత చేపట్టదలచని తొలి అధికారిక పర్యటన ఏమంటే? కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన. కానీ ఆ పర్యటన అకస్మాత్తుగా వాయిదా పడింది. పెథాయ్ తుఫాన్ కారణంగా సిఎం తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈ మేరకు సిఎం కార్యాలయం ఒక మెసేజ్ ను మీడియాకు ఇచ్చింది. 

మంగళవారం సిఎం కేసిఆర్ కాళేశ్వరం పర్యటనను పెథాయ్ తుఫాన్ కారణంగా వాయిదా వేసుకున్నారు. తదుపరి పర్యటన ఎఫ్పుడు ఉంటుందనేది త్వరలో నిర్ణయం తీసుకుంటారు అని ప్రకటన వెలువడింది.

అయితే ఈనెల 18న అంటే మంగళవారం మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని ఒక దశలో ప్రచారం సాగింది. తొలుత కేసిఆర్ తో సహా ఇద్దరు కేబినెట్ లో చేరారు. మరో నలుగురిని కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉందని ప్రచారం సాగింది. కానీ కేసిఆర్ కాళేశ్వరం పర్యటన కారణంగా కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం పెండింగ్ లో పడే చాన్స్ ఉందని అన్నారు.

అయితే కాళేశ్వరం పర్యటన వాయిదా పడిన నేపథ్యంలో కేసిఆర్ కొత్త మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేసే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకుంటారోనని పార్టీ నేతలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.