సిఎం కేసిఆర్ కు కాంగ్రెస్ శ్రావణ్ స్ట్రాంగ్ పంచ్

తెలంగాణ సిఎం కేసిఆర్ శనివారం ప్రగతిభవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలకు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ స్పందించారు. ఆదివారం గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో దాసోజు ఏం మాట్లాడారో కింద చదవండి.

కాంగ్రెస్ నేతలను ఇడియట్ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. తన స్థాయిని తగ్గించుకుని ఆధిపత్య అహంకారం తో కేసిఆర్ మాట్లాడారు. కేసిఆర్ భాష చూసి సభ్య సమాజం సిగ్గుపడుతుంది. 

కాంగ్రెస్ పిటిషన్ వేసి ఎన్నికలు ఆపిందని కేసఆర్ చెప్పడం పచ్చి అబద్ధం. 2018లో తెచ్చిన పంచాయతీ రాజ్ ఆక్ట్ లోనే తప్పులున్నాయి. బీసీ రిజర్వేషన్ ఎలా తగ్గించారని నేను 2018 జూన్ లో సీఎం కు లేఖ రాసాను. స్పందన లేకపోవడంతో హైకోర్టులో పిటిషన్ వేసాను. నా పిటిషన్ లో ఎక్కడా ఎన్నికలు అపమని ఎక్కడా లేదు.

పక్క రాష్ట్రం వార్తలు రాయొద్దనడం భావ నియంత్రనే. మరి పక్క రాష్ట్ర వార్తలు వద్దన్న మీరు పక్క రాష్ట్రాల భాషల్లో ఎందుకు అడ్వర్టైజ్ మెంట్లు ఇచ్చారో చెప్పాలి. ఇదేనా ఫెడరల్ పాలిటిక్స్ అంటే. మీరు పక్క రాష్ట్రం నేతలు నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీని కలిస్తే ఇక్కడ వార్తలు ఎందుకు మరి. మీకు పక్క రాష్ట్రం కాంట్రాక్టర్లు ఎందుకు?

నిన్న సీఎం చాలా తప్పు మాట్లాడారు. నేను ఎన్నికలు అపమని కోరినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా. కోర్ట్ తీర్పు ఇచ్చినా కుల గణన చేయకుండా కేసిఆర్ మోసం చేశారు. గోపాల్ రెడ్డి అనే టిఆర్ఎస్ ఎంపిటిసి పిటిషన్ వేస్తే 50 శాతం రిజర్వేషన్ ఇవ్వొద్దని కోర్టు చెప్పింది. అతన్ని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదో సమాధానం చెప్పాలి. 

బీసీ రిజర్వేషన్ పై హేతుబద్ధంగా కొట్లాడలేదు. ఎన్నికలు ఆపాలని కుట్ర చేసింది మేము కాదు టిఆర్ఎస్ నే. పంచాయితి ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ తగ్గిస్తూ దొడ్డిదారిన ఆర్డినెన్స్ తెచ్చారు. ఎబిసిడి వర్గీకరణ చేసి రిజర్వేషన్ ఇవ్వాలని మేము కొరినం. 

2009లో జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీసీలను క్యాటగిరి చేసి రిజర్వేషన్ అమలు చేయాలని టిఆర్ఎస్ కోర్ట్ లో పిటిష న్ వేయలేదా? అది తప్పుకానప్పుడు మేము కొరితే తప్పు ఎలా అవుతుంది.

సమగ్ర కుటుంబ సర్వే , కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు లు కడుతున్న కేసీఆర్ కు బీసీ గణన చేయడం పెద్ద సమస్యా? చేయాలన్న చిత్తశుద్ధి లేదనే ఈ ప్రేలాపణలు. నాకు ఒక్క రోజు పదవి ఇవ్వండి పని చేసి చూపిస్తా. చేయకపోతే నాకు నేనే పాతర వేసుకుంటా. 

కర్ణాటకలో మాదిరిగా బీసీ వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్ లు అమలు చేయాలని కోరుతున్నాను.