ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీనే మెరుగైనదని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణలో అమల్లోకి తీసుకురావడం మంచి నిర్ణయమేనని పలువురు పేర్కొంటున్నారు.ఎందుకంటే, ఆరోగ్యశ్రీలో కరోనావైరస్ చికిత్స లేదు. ఆయుష్మాన్ భారత్‌లో కరోనాకు ఉచిత వైద్య చికిత్స అందిస్తుండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ ఇక తెలంగాణలోనూ అమల్లోకి రానుంది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకాలను అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన ప్రగతి సమీక్షలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రధాని నరేంద్ర మోడీకి తెలియజేశారు. వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులు, ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్ తదితర అంశాలపై ప్రధాని మోడీ సమీక్షించారు.
తెలంగాణలో 98.5శాతం ఇళ్లకు నల్లాల ద్వారా సురక్షిత మంచినీరు అందిస్తున్న తీరును కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు.కాగా, కేసీఆర్ ఇటీవల ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీతోపాటు కేంద్రమంత్రులను కలిసిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఇది ఒకటి కావడం గమనార్హం. ఇప్పటికే రైతులు తమ పంటలను ఎక్కడైనా.. వారికి నచ్చిన ధరకు అమ్ముకోవచ్చంటూ ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.