గత రెండు రోజులుగా తెలంగాణలోని కొడంగల్ నియోజకవర్గం అట్టుడికిపోతున్నది. కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి అనుచరుల ఇండ్లపై పోలీసుల దాడులు, ఆ తర్వాత రేవంత్ రాత్రివేళల్లో ధర్నాలు జరిగాయి. తర్వాత కేసిఆర్ సభను అడ్డుకుంటామని రేవంత్ ప్రకటన నేపథ్యంలో కొడంగల్ మరింత వేడెక్కింది. దీంతో మంగళవారం తెల్లవారుజామున రేవంత్ ను అరెస్టు చేశారు పోలీసులు. ఈనేపథ్యంలో టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కొడంగల్ లో ఎలా మాట్లాడతారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. కేసిఆర్ స్పీచ్ లో ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి అనే పేరును కూడా తీసుకోలేదు. రేవంత్ రెడ్డిపై కూడా విమర్శలు చేయలేదు. తన స్పీచ్ లో కాంగ్రెస్ నేతలను కేసిఆర్ టార్గెట్ చేశారు. పనిలో పనిగా చంద్రబాబును కూడా గట్టిగానే టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. కేసిఆర్ కొడంగల్ లో ఏం మాట్లాడారో కింద చదవండి.
ఈ కొడంగల్ సభ ద్వారా మీకు సంతోషకరమైన వార్త చెబుతున్న ఇయ్యాల. 7వ తేదీనాడు పోలింగ్ ఉంది. 11 రిజల్ట్ వస్తది. మీరు చూడండి. పాత పాలమూరు జిల్లాలో 14 కు 14 సీట్లు కారు గుర్తే గెలవబోతున్నది. మీరు 11 నాడు చూడండి కాకపోతే.
కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు భారత దేశంలో ఎక్కడైనా ఉందా? దయచేసి మీరు ఆలోచన చేయాలి. అమ్మాయి పుడితే 12 వేలు ఇచ్చి కేసిఆర్ కిట్ ఇస్తున్నం. కళ్యాణ లక్ష్మి మీ ఊరికి వస్తున్నది. మిషన్ భగీరథ నీళ్లు మీ ఊరికి వస్తున్నాయి. కేసిఆర్ కిట్లు మీ ఊరికి వస్తున్నాయి. మీరు దీవించి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఆసరా పింఛన్లు 2వేలు, వికలాంగులకు 3వేలు చేస్తామని చెబుతున్న. నిరుద్యోగ యువతకు 3వేల పదహార్లు నిరుద్యోగ భృతి ఇస్తామని చెబుతున్నా.
ఐక్యరాజ్య సమితి కూడా అభినందించిన స్కీమ్ తెలంగాణలో రైతుబంధు. ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు రైతు బంధు పథకం. ఈ పథకం కింద ఎకరానికి నాలుగు వేలు ఇస్తున్నం. పెట్టుబడి కింద. ఫ్రీ కరెంటు ఇస్తున్నాం. అలాగే రైతు భీమా ఇస్తున్నాము. రైతులు ఎవరైనా చనిపోతే పైరవీలు అవసరం లేకుండా, ఎవలికి రూపాయ లంచం ఇవ్వ అక్కెరలేకుండా వారి ఖాతాలో 5 లక్షల రూపాయలు పడతున్నాయి.
రెసిడెన్సియల్ పాఠశాలలు భ్రహ్మాండ్లంగా పెట్టినం. అందరిని సమానంగా గౌరవిస్తున్నం. మైనార్టీలకు రెసిడెన్సియల్ పాఠశాలలు పెట్టినం. పాలమూరు జిల్లాకు శత్రువులు ఎక్కడో బయట లేరు. పాలమూరు జిల్లాలోనే ఉన్నరు. పాలమూరు జిల్లా కరువు జిల్లా. కొండలు, బండలు, గుట్టలు రాళ్లు. మధ్య మధ్యలో ఎక్కడో గింతంత పొలం. జయశంకర్ సార్ ఉద్యమ సమయంలో ఇక్కడకు వస్తే చాలా బాధపడేవారు. కండ్ల నీళ్లు తెచ్చుకునేవారు.
కొడంగల్ ప్రాంతానికి నీళ్లు తేవడానికి 35 వేల కోట్లు మంజూరు చేసినం. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని తెచ్చినం. ఆ ప్రాజెక్టు పూర్తయితే పాలమూరు అంతా ఆకుపచ్చ గా మారిపోతది. నెట్టెంపాడు, భీమా కంప్లీట్ చేశాము. 2వేల చెరువులు పాలమూరులో నింపుతున్నాం. ప్రజలు చాలా సంతోష పడుతున్నారు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా వచ్చే నీళ్తతో మరో 20లక్షల ఎకరాలు పారుతది.
ఈ ప్రాజెక్టును అడ్డుకునేది ఎవరు? చంద్రబాబునాయుడు. కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా చంద్రబాబునాయుడిని భుజాల మీద తెచ్చుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ. నాగం జనార్దన్ రెడ్డి, మరో ఇద్దరు పాలమూరు ఎత్తిపోతల కట్టొద్దని హైకోర్టు కు పోయిర్రు. వారి చెంప మీద చెల్లుమని కొట్టింది న్యాయస్థానం. మన దరిధ్రులు కూడా చంద్రబాబుతో కలిసి కుట్రలు చేస్తున్నారు. పాలమూరు దరిధ్రం పోవాలంటే కాంగ్రెస్ దరిధ్రులకు బుద్ధి చెప్పాలె.
1956లో ఉన్న తెలంగాణను పోగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఇదే జిల్లాలో పుట్టిండు బూర్గుల రామకృష్ణారావు. నెహ్రు సాబ్ తోటి ఏం మాట్లాడతాం అని తెలంగాణను వదులుకున్నరు.
ఎన్ని అవమానాలు చేసినా, భరించి 14 ఏండ్లు మొండిగా కొట్లాడితే తెలంగాణ వచ్చింది. నేను చావునోట్లో తలకాయ పెట్టి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. అట్లా వచ్చిన తెలంగాణను మల్లా ఆంద్రోళ్ల చేతిలో పెడతామా? చంద్రబాబు నాయుడు చేతిలో పెడతామా? చంద్రబాబు నాయుడు వస్తే రేపు నీళ్లు బంద్ అంటాడు. ఎన్నికలు అయిపోయిన తెల్లారి నేను వచ్చి ఐదారు నియోజకవర్గాలను తిరిగి మీ సమస్యలు పరిష్కరిస్తాను.
కొడంగల్ మారుమూల ప్రాంతం. బాగా వెనుకబడిన ప్రాంతం. బాగా అభివృద్ధి కావాలి. మనకు డబ్బుకు కొదవలేదు. సంపదకు కొదవ లేదు. కొడంగల్ ను బ్రహ్మాండ్లంగా అభివృద్ధి చేస్తా. గవర్నమెంట్ వచ్చిన తర్వాత వారం పదిరోజుల్లో జీవో ఇచ్చి నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తా.
వంద పడకల ఆసుపత్రి కావాలన్నరు. తప్పకుండా దాన్ని కూడా ఏర్పాటు చేస్తాము. గతంలో చేనేత కార్మికుల జీవితాలు బాగాలేవు. తెలంగాణలో బాగుపడ్డరు.
లంబాడీలకు ఎవరూ ఏం చేయలేదు. కాంగ్రెస్ చేయలేదు. టిడిపి చేయలేదు. కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం లంబాడీలకు తీపి కబురు అందించింది. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసినం. మీ కొడంగల్ లో 41 తండాలు గ్రామపంచాయతీలు అయినయ్.
ప్రతి వ్యక్తి మొఖం మీద చిరునవ్వు వస్తేనే బంగారు తెలంగాణ. యాదవులను పట్టించుకోలే. ముదిరాజ్ లను పట్టించుకోలే. చేనేత కార్మికులను పట్టించుకోలే. వెయ్యి కోట్లు పెట్టి మత్స్య పరిశ్రమ అభివృధ్ది చేస్తున్నం.
నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ కు ప్రతిరోజు 650 లారీల గొర్రెలు వస్తాయి. మనదగ్గర యాదవులు లేరా అని అడిగిన. ఇప్పుడు 70లక్షల గొర్రెలు పంచినం. వాటికి 40లక్షల పిల్లలు పుట్టినయ్. తెలంగాణ యాదవులు 1500 కోట్ల సంపద కలిగి ఉన్నారు. తెలంగాణలో ధనిక యాదవులు తెలంగాణలోనే ఉన్నారు.
నరేందర్ రెడ్డి ని దీవించండి. వంద శాతం తప్పుకుండా మీ కోరికలు అన్నీ నేనే వచ్చి కూసోని మంజూరు చేస్తా. డిగ్రీ కాలేజీ, ఐటిఐ, పాలిటెక్నిక్ కూడా ఏర్పాటు చేస్తాము. పెద్దలు గుర్నాథ్ రెడ్డి యువకుడి మాదిరిగా పనిచేస్తున్నారు. వారిని గుండెల్లో పెట్టుకుంటాము.