అదిరిందయ్యా చంద్రం, అక్కడేం జరుగుతున్నదో జర చూడు

కచ్చితంగా అంచనా వేస్తే చంద్రబాబు నాయుడు ఏ మాత్రం ఆకర్షణీయమయిన పర్సనాలిటి కాదు. వైఎస్ ఆర్ లాగా మాంచి పంచెకట్టుతో అందంగా కనిపించాలన్న ఆలోచన కూడా లేని వాడు. కెసియార్ లాగా ఆయనకు అకట్టుకునే భాష లేదు. చేతులు బార్లా చాపుతూ అరచేతిని చక్రంలా తిప్పుతూ, తలకాయ 180 డిగ్రీలు తిప్పి, మనిషంతా కదిలేలా మోదీలాగా ఉపన్యాసాలిచ్చే శక్తి లేదు. ఒక్క మంచి తిట్టు రాదు. స్టేజీ మీద నుంచి చక్కగా బెదిరించడం చేయలేడు.. హెచ్చరించడం రాదు.ఇంకా స్పష్టంగా చెబితే కోపం వస్తే ఉన్న భాష మర్చిపోతాడు, ఇంగ్లీష్ లోకి మారితే అంతే సంగతులు. ఎపుడూ సామెతలు జోడించలేడు. పిట్టకథలసలూ చెప్పలేడు. వ్యవహార మంతా బాగా చప్పగా ఉంటుంది. 35 ఏళ్లుగా ఒకే రకం పల్చటి తేనె రంగు ప్యాంటు షర్టు వాడేస్తున్నాడు, అందులో ఏ మార్పు లేదు. వన్ పర్సెంట్ కూడా అందులో ఫ్యాషన్ ఉండదు. క్లింటన్ దగ్గిర నుంచి దావోస్ లో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలదా ఎవరినీ కలిసినా ఇదే ధోరణి. నిజానికి ఆయన పర్సనాలిటీ పరంగా ఎవరికీ పెద్ద నచ్చడు. సెక్సీ పొలిటిషియన్స్ అని ఇండియా లో ఎవరినైనా వర్ణించాలంటే ఆయన లాస్టులో ఉంటాడు.

అయితే ఆయన ఇపుడు తెలంగాణా రాష్ట్రసమితి కుటుంబానికి వణుకుపుట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి కెసియార్, కొడుకు కెటియార్, కూతురు కవిత, అల్లుడు హారీష్ రావు ఆయన్ను చూస్తే బెదిరిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయనతో పొత్తు పెట్టుకుందన్న వార్త షాక్ కొట్టింది. వాళ్లింకా కోలుకోలేదు. కోలుకుంటారన్న గ్యారంటీ లేదు.పారనాయిడ్ అయిపోయారు. మాట తడబడుతూ ఉంది. ఏవేవో మాట్లాడుతున్నారు. ఆయన పేరు లేకుండా ఉపన్యాసాలు లేవు. ఆయన పేరు తల్చకుండా పూటగడవడం లేదు. యావత్తెలంగాణను ఏకంచేయాలంటే చంద్రబాబు పేరు వాడటమే మార్గం అనుకుంటున్నారు. ఎక్కడ పోయినా, ఎక్కడ మాట్లాడినా కెసియార్, కెటియార్, కవిత, హరీష్ లు వల్లిస్తున్నదొక్కటే మాట… చంద్రబాబు. ఆయన తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించేందుకు వస్తున్న అవతార పురుషుడి గా చూస్తున్నారు. దీనిని ఆపేయాలి ఎలా?అనేది ప్రసంగాల సారాంశం. నువ్వు తెలంగాణ వస్తే మేం ఆంధ్రా వస్తాం అంటున్నారేమిటో? దీనికి పర్మిషనేంటి?

మొత్తానికి  తెలంగాణలో ఆయన కింగ్ మేకర్ అయ్యేలా ఉన్నారని చెప్పకనే చెబుతున్నారు. ఈ పరిణామం అపకుంటే కొంపలంటుకుంటాయనే అనే ఆందోళన వాళ్ల ఉపన్యాసాల్లో కనిపిస్తుంది. తనలో ఇంత శక్తి ఉందా అని చంద్రబాబు అశ్చర్య పోయేలా చేస్తున్నారు. 119 నియోజకవర్గాల్లో జరుగుతున్న తెలంగాణ ఎన్నికల యుద్ధాన్ని వాళ్లు చంద్రబాబు వ్యతిరేక యుద్ధంగా మార్చారు. చంద్రబాబు కొండంత వాడిగా వర్ణించి వర్నించి చివరకు వాళ్లే భయపడుతున్నారు.

15 సంవత్సరాల పాటు ఉద్యమం నడపి, తెలంగాణ జాతిపిత అని అనిపించుకుంటూ, నాలుగున్నరేళ్లు బంగారు తెలంగాణ ను నిర్మాణం జరుపుతున్నా ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు ఇలా చంద్రబాబు పీవర్ తో వణికి పోవడం ఏమిటి? ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్లుంది.

నూరు సీట్లొస్తాయనొకసారి, ఎఐ ఎమ్ ఐఎమ్ కు ఏడు సీట్లిచ్చి మిగతా వన్నీ నా బ్యాగ్ లో కూరుకుంటానని ధీమా గా చెబుతూ వచ్చిన  తెలంగాణ సాటి లేని మేటి పొలిటీషన్ కెసియార్ కు ఏమయింది. ప్రభుత్వం మాదేనని, ఇపుడే వేడి వేడిగా సర్వేవచ్చిందని చెప్పిన కెసియారేనా ఆయన.

ఇంట్లో పెద్దాయన భయపడితే, పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది, కెటియార్, కవిత, హరీష్ లు చూడండి భయంతో ఎలా మాట్లాడుతున్నారో. వాళ్ల ప్రసంగాలు వింటే, తెలంగాణ రాష్ట్ర సమితికి చంద్ర బాబు వల్ల అంత ప్రమాదం ముంచుకొచ్చిందా? ఉద్య మాలతో రాటుదేలిని తెలంగాణ ప్రజలను చంద్రబాబు హిప్నటైజ్ చేసి ఓట్లన్నీ కాంగ్రెస్ కు పడేలా నిజంగా చేస్తున్నారా? ఇలా చేస్తున్నారని ఇంటెలిజన్స్ వర్గాలు హెచ్చరించాయా. వీళ్ల ఉపన్యాసాల వింటే రాజకీయ పండితులకు కాదు, దారిన పోయే దానయ్యలకు కూడా ఇదే అనుమానం వస్తుంది.

నిన్న హైదరాబాద్ లో కాపు సేవా సమితి మీటింగ్ లో కెటియార్ మాట్లాడింది చూడండి.చంద్రబాబుతప్పమరొక మాటే వినపల్లేదు.

‘‘అసాధ్యమనుకున్న తెలంగాణను సాధించిన కేసీఆర్‌ముందు చంద్రబాబు ఏపాటి? అని మంత్రి కే తారకరామారావు అన్నారు. తొమ్మిదేండ్లు అధికారంలో ఉండి.. నాలుగు బిల్డింగులు కట్టి, తమకే ఓటేయాలని పోజుకొడుతున్న చంద్రబాబుకే అంత ఉంటే.. అసాధ్యమనుకున్న తెలంగాణను సుసాధ్యంచేసి.. నాలుగుకోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన కేసీఆర్‌కు ఎన్నిసార్లు ఓట్లేయాలి? మేం ఎంత చెప్పుకోవాలి? అని ప్రశ్నించారు. ఆధునిక తెలంగాణ సృష్టికర్త, నిర్మాత తానేనని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదం.’’ ఆయన పూర్తి ప్రసంగం నమస్తే తెలంగాణ లో ఉంది.
‘బాబు మనకు అవసరమా’ నమస్తే తెలంగాణ సంపాదకీయం.

‘‘మహాకూటమి గెలిస్తే బాబు చేతికి తెలంగాణ. ఆయన శనీశ్వరుడు, మన నెత్తికి ఎక్కుతాడు. లగడపాటికి, చంద్రబాబుకు రహస్య ఎజండా ఉంది….’’ ఇది స్టేషన్ ఘన్పూర్ లో హరీష్ రావు వాదన.

‘‘ తెలంగాణకు ఆంధ్రకు నీళ్ల పంచాయతీ వస్తే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న బాబు మనకు న్యాయం చేస్తాడో, ఆంధ్రకు అండగా నిలుస్తాడో ఆలోచించండి.’’ జగిత్యాలలో నిజాంబాద్ ఎంపి కవిత.

ఎన్నికల్లో టిఆర్ ఎస్ గెలిస్తే, క్రెడిట్ చంద్రబాబుదే. అదే విధంగా కాంగ్రెస్ గెలిస్తే క్రెడిట్ ఇద్దరికి పోతుంది. ఒకరు చంద్రబాబుది, రెండోది కెసియార్ కుటుంబం.