మునుగోడు ఉపఎన్నికలో ప్రధానంగా టీ.ఆర్.ఎస్, బీజేపీ పార్టీల మధ్య పోటీ ఉందనే సంగతి తెలిసిందే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వల్ల ఈ ఉపఎన్నిక జరుగుతుండగా ఈ ఉపఎన్నికలో టీ.ఆర్.ఎస్ గెలవాలని కేసీఆర్ ఫిక్స్ అయ్యారు. ఎన్నికల్లో గెలవడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదని ఆయన భావిస్తున్నారు. బీజేపీ నేతలు టీ.ఆర్.ఎస్ లో చేరడం కేసీఆర్ వ్యూహంలో భాగమేనని బోగట్టా.
టీ.ఆర్.ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో చిన్న స్థాయి నేతలు టీ.ఆర్.ఎస్ లో ఉంటే తమకు భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నారు. తెలంగాణ బీజేపీ వరుస షాకులు తగులుతుండటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉంది. మరోవైపు కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించిన నేపథ్యంలో మునుగోడు ఉపఎన్నికలో గెలుపు ద్వారా ఇంట గెలిచి రచ్చ గెలుపు దిశగా అడుగులు వేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.
మునుగోడులో బీజేపీని ఓడించడం ద్వారా బీజేపీకి గట్టి పోటీ ఇచ్చే పార్టీ బీ.ఆర్.ఎస్ అని ప్రూవ్ చేయాలని కేసీఆర్ అనుకుంటున్నారు. పలు సర్వేలలో వెలువడిన ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడంతో కేసీఆర్ గెలుపు కోసం ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదలొద్దని సూచనలు చేశారని సమాచారం. ఖర్చు ఎక్కువైనా వెనకడుగు వేయవద్దని నేతలకు ఇప్పటికే సూచనలు వచ్చాయని బోగట్టా.
ఎన్నికల్లో గెలుపు ముఖ్యం తప్ప ఏ విధంగా గెలిచారనే విషయాన్ని ఎవరూ పట్టించుకోరు. ఈ కారణం వల్లే కేసీఆర్ ఉపఎన్నికను సీరియస్ గా తీసుకుని గెలుపుకు ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నారు. ఒక నేత చేతిలో 50 ఓట్లు ఉన్నాయని తెలిసినా అధికార పార్టీ లక్షల్లో డబ్బు ఇస్తోందని తెలుస్తోంది.