సినిమా రిలీజ్ అయ్యితే అది హిట్టా ..ఫట్టా అనేది తేలుతుంది. అసలు రిలీజ్ కే వెళ్లకపోతే ఆ దర్శక,నిర్మాతల బాధ వర్ణనాతీతం. ఆ పరిస్దితి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమాకు రావటం ఎంత దురదృష్టం.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఉద్యమ సింహం’కు అదే పరిస్దితి ఎదురైంది.
తెలంగాణ సాధన కోసం కేసీఆర్ తలపెట్టిన ఉద్యమాన్ని విజువలైజ్ చేసి సినిమా చేసారు. అన్ని పనులు పూర్తి చేసి సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చింది. మార్చి 29న సినిమా రిలీజ్ కి సంబంధించి మీడియా ప్రకటనలు వదిలారు. అయితే ఈ సినిమాని బయోపిక్ కేటగిరీలో పరిగణించి రిలీజ్ విషయంలో ఇబ్బందులు క్రియేట్ చేశారని- రిలీజ్ కానీకుండా అడ్డుకున్నారని దర్వకనిర్మాతలు వాపోవడం మీడియాలో చర్చనీయాంశమైంది.
ఈ సినిమా రిలీజ్ వేళ తమపై కుట్ర జరిగిందని సినిమాని రిలీజ్ చేయనీకుండా థియేటర్ యాజమాన్యాన్ని బెదిరించారని ఈ రోజు దర్శకనిర్మాతలు మీడియా ముందు తమ బాధను వెళ్లకక్కారు. హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో జరిగిన తాజా మీడియా సమావేశంలో దర్శకనిర్మాతలు నాగేశ్వరరావు – కృష్ణంరాజు కన్నీళ్ల పర్యంతం అయ్యి మాట్లాడారు.
దర్శక,నిర్మాతలు మాట్లాడుతూ….రాజకీయాలకు అతీతంగా తీస్తున్న చిత్రమిది. ఇది బయోపిక్ కాదు. కేవలం ఉద్యమ నేపథ్యంపై తీసిన చిత్రమిది. కేసీఆర్ గారి గురించి ప్రజలకు తెలియని విషయాలెన్నో చిత్రంలో చూపిస్తున్నాం. సినిమాలో ఐదు పాటలున్నాయని ఉద్యమస్ఫూర్తిని తెలియజేస్తాయని తెలిపారు. కేసీఆర్ పై అభిమానంతో తీశాం. అయితే ఈ చిత్రం రిలీజ్ కోసం తెరాసను కానీ – కేసీఆర్ ని కానీ సాయం కావాలని తాము కోరలేదని తెలిపారు.
అలాగే …ఎలక్షన్ ముందే రిలీజ్ చేస్తే ఉద్యమం కోసం కేసీఆర్ ఎంత ప్రయాస పడ్డారన్నది ప్రజలకు తెలుస్తుందని భావించి రిలీజ్ చేస్తున్నామని – అయితే రిలీజ్ కాకుండా థియేటర్ యాజమాన్యాన్ని బెదిరించారని వెల్లడించారు. అందుకే ఈ చిత్రాన్ని యూట్యూబ్ సహా శాటిలైట్ – సామాజిక మాధ్యమాల్లో ఉచితంగా రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. టీవీ చానెళ్లకు ఉచితంగా ఈ సినిమాని ఇచ్చేస్తున్నామని నిర్మాతలు అన్నారు.