కేసీయార్ లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారా.?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని, ‘దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి’గా అభివర్ణిస్తోంది భారతీయ జనతా పార్టీ. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ‘కేవలం తన కుటుంబ సభ్యులకు దోచి పెట్టడానికేనన్నట్లుగా తెలంగాణలోని అధికార పార్టీ వ్యవహరిస్తోంది..’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల హైద్రాబాద్ పర్యటన సందర్భంగా సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని ఈ స్థాయిలో ఆరోపణలు చేయడం చిన్న విషయం కాదు.

ఇదిలా వుంటే, దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ బలపడుతుందని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ నినదిస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాల్ని విస్తరిస్తున్నారు కూడా.! ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ యాక్టివ్ అవుతోంది. కాగా, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ తమతో కలిసొచ్చే వ్యక్తులు లేదా పార్టీల కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి బీఆర్ఎస్ సిద్ధంగా వుందని బీజేపీ ఆరోపిస్తోంది.

లక్షల కోట్ల ప్రజాధనం లూటీ చేసి, దాన్ని జాతీయ రాజకీయాల కోసం కేసీయార్ ఖర్చు పెట్టబోతున్నారన్నది బీజేపీ ఆరోపణ. కేంద్రంలో అధికారంలో వున్నది బీజేపీనే. గడచిన తొమ్మిదేళ్ళలో తెలంగాణలో జరిగిన అవినీతిని వెలికి తీయడం బీజేపీకి పెద్ద కష్టమా.? కాదు కదా.! కేవలం ఆరోపణలతో సరిపెడితే ఏం ప్రయోజనం.?