KCR: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావడంతో కాంగ్రెస్ నేతలు విజయోత్సవ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నాయకులు మాత్రం దీక్ష దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. 15 సంవత్సరాల క్రితం సరిగా నవంబర్ 29వ తేదీ కేసీఆర్ తెలంగాణ ఉద్యమం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశారని బిఆర్ఎస్ నేతలు గుర్తు చేసుకుంటూ దీక్షా దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బిఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ తీరును తప్పుపడుతున్నారు. ప్రత్యేక తెలంగాణను తీసుకువచ్చింది కేసీఆర్ అని ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించి ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నామని తెలిపారు. తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ కాదని గుర్తు చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బిఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లిదయాకర్ వరంగల్ లోని మీడియా సమావేశంలో మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు.
తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ఎవరు అధైర్య పడవద్దు అని తెలిపారు. త్వరలోనే కెసిఆర్ తెలంగాణకు మళ్ళీ ముఖ్యమంత్రిగా రాబోతున్నారని ఈయన ప్రజలకు తెలియజేశారు. త్వరలోనే దేశ వ్యాప్తంగా జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా రావని తిరిగి మళ్లీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని భరోసా కల్పించారు.
తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ వస్తారని, రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలలోనూ వసతి గృహాలలో ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు ఎన్నో అవస్థలు పడుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి మాత్రం పాలన గాలికి వదిలి తన పార్టీ నేతలతో కలిసి ఢిల్లీ టూర్లు వేస్తున్నారని, ఈ విషయాలన్నింటినీ ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు త్వరలో రాబోయే ఎన్నికలలోనే ప్రజలు తమ ఓటు రూపంలో రేవంత్ రెడ్డికి బుద్ధి చెబుతారంటూ ఎర్రబెల్లి దయాకర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.