హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ కొత్త సంవత్సరం బహుమతి ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలతో పాటు పదవి విరమణ వయస్సు కూడా పెంచేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని శాఖల్లోని ఉద్యోగుల వేతనాలతో పాటు పింఛనుదారులకు ఇచ్చే పింఛను కూడా పెంచేందుకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కేసీఆర్ పలు కీలక నిర్ణయం తీసుకున్నారు.
‘‘తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర ఎంతో గొప్పది. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ ప్రాంత ఉద్యోగులు టీఎన్జీవో పేరుతో తెలంగాణ అస్తిత్వాన్ని గొప్పగా నిలుపుకున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణ ఖచ్చితంగా ధనిక రాష్ట్రం అవుతుందని అంచనా వేశాం. అప్పుడు ప్రభుత్వానికి, ప్రజలకు సేవలందిస్తున్న ఉద్యోగులకు మంచి వేతనాలు ఇవ్వవచ్చని భావించాం. కొత్త ఏడాదిలో మార్చి నుంచి ఉద్యోగుల సమస్యలు శాశ్వతంగా పరిష్కారమవుతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని శాఖల్లో ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశించారు. ఆర్టీసీ ఉద్యోగులకూ వేతనాలు పెంచాలని నిర్ణయించారు. కారుణ్య నియామకాల ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలన్నారు.
నూతన సంవత్సర కానుకగా రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని, అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. pic.twitter.com/1YNFUQ7hlC
— Telangana CMO (@TelanganaCMO) December 29, 2020
wages
అన్నిరకాల ఉద్యోగులను కలిపి తెలంగాణలో 9,36,976 మంది ఉంటారని, అందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని సీఎం చెప్పారు.వేతనాల పెంపుతోపాటు ఉద్యోగ విరమణ వయస్సు పెంపు, పదోన్నతులు ఇవ్వడం, అవసరమైన బదిలీలు చేయడం, సరళతరమైన సర్వీసు నిబంధనల రూపకల్పన, రిటైర్ అయ్యే రోజే ఉద్యోగులకు అన్నిరకాల ప్రయోజనాలు అందించి గౌరవంగా వీడ్కోలు పలకడం, కారుణ్య నియామకాలన్నింటినీ చేపట్టడం లాంటి ఉద్యోగ సంబంధ అంశాలన్నింటినీ ఫిబ్రవరిలోగా సంపూర్ణంగా పరిష్కరించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. అన్నిశాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుండి ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టనున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు తక్కువ వేతనాలు కలిగిన ఉద్యోగులున్న ఆర్టీసీలో కూడా వేతనాలను పెంచాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. అవసరమైతే వేతనాల పెంపువల్ల ఆర్టీసీపై పడే భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.