Kavitha: కెసిఆర్ కుమార్తె కవిత ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భాగంగా అరెస్ట్ అయ్యే జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే .అయితే ఈమె జైలు నుంచి విడుదలైన తర్వాత రాజకీయాలలో పెద్దగా యాక్టివ్ గా కనిపించలేదు. కొంతకాలం పాటు ఈమె పూర్తిగా తన వ్యక్తిగత జీవితానికి సమయం గడిపారు. అలాగే ఈమె జైలులో ఉండడంతో గైనిక్ సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో రాజకీయాలకు కూడా దూరమయ్యారు.
ఇకపోతే ప్రస్తుతం కవిత పూర్తిగా సెట్ అవ్వడంతో రాజకీయాలలో ఫుల్ యాక్టివ్ అయ్యారు. సోమవారం కోరుట్ల నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఈమె కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కక్షగట్టి రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడుతోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తమ కార్యకర్తలను వేధిస్తే చూస్తూ ఊరుకోమని వారి జోలికి వస్తే తాట తీస్తామని తెలిపారు.
కేసులకు వ్యతిరేకంగా కొట్లాడడానికి పార్టీ పరంగా లీగల్ టీమ్ ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సోషల్ మీడియాలో నిజాలను ప్రచారం చేసినా, ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపినా కాంగ్రెస్ ప్రభుత్వం అసలు సహించలేకపోతుందని తెలిపారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణకు నిధులు వరదలయ్యిపారేవి. ప్రస్తుతం మాత్రం మంత్రుల నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి వరకు అదే పనిగా పోటీపడి తిట్లు తిడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తిట్లు ఏరులై పారుతున్నాయని తెలిపారు.
కేసీఆర్ మొక్క అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదం. కేసీఆర్ మొక్క కాదు పీకేయడానికి.. కేసీఆర్ ఒక వేగుచుక్క. రేవంత్ రెడ్డి గురువులకే చుక్కలు చూపించి తెలంగాణ సాధించిన శక్తి కేసీఆర్ అంటూ తన తండ్రి గురించి ఎంతో గొప్పగా మాట్లాడటమే కాకుండా కెసిఆర్ గురించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈమె తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.