ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత మరోసారి ఈరోజు ఈడీ విచారణకు హాజరు కానుండటంతో హస్తిన కేంద్రంగా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈ రోజు విచారణలో బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై లతో కలిపి కవిత విచారణ ఉండొచ్చని చెబుతున్నారు. ఈ రోజుతో మాగ్జిమం విచారణ పూర్తయిపోవచ్చని.. అనంతరం కవిత అరెస్టు ఉండే అవకాశాలున్నాయంటూ హస్తిన కేంద్రంగా ఊహాగాణాలు వస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో.. ఆరోగ్యం బాగాలేదు అంటు.. నేటి ఈడీ విచారణకు కవిత గైర్హాజరయ్యారు! అవును… అనారోగ్య కారణాలతో నేటి ఈడీ విచారణకు హాజరు కాలేనంటూ ఈడీ అధికారులకు మెయిల్ పెట్టడంతోపాటు.. బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ ద్వారా సమాచారాన్ని చేరవేశారు కవిత! ఒక పక్క నేటితో అరుణ్ పిళ్ళై ఈడీ కస్టడీ ముగియనుంది. మరోపక్క అరుణ్ పిళ్లైతో కలిపి కవితను ఈరోజు విచారించి, కథ క్లైమాక్స్ కి తేవాలని ఈడీ అధికారులు భావించారంట. సరిగ్గా ఈ సమయంలో విచారణకు రాలేనంటు కవిత ఈడీ అధికారులు షాకిచ్చారు!
అయితే ఈ రోజు ఈడీ అధికారుల ముందు ఉదయం 11 గంటలకే కవిత హాజరు కావాల్సి ఉంది! అయితే విచారణకు వెళ్లకుండా 11 నుంచి 11.30 మధ్యలో న్యాయ నిపుణులతో తీవ్రంగా చర్చించారు కవిత! దీంతో… ఆ న్యాయ నిపుణుల సలహా మేరకే కవిత విచారణకు గౌర్హాజరయ్యి ఉండొచ్చనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
అయితే కవిత వినతిని ఈడీ తోసి పుచ్చింది. విచారణకు రావాల్సిందేనని కవితకు ఈడీ తేల్చి చెప్పింది. దీంతో కవిత తదుపరి స్టెప్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది.
కాగా ఢిల్లీలో కవితకు మద్దతుగా బీఆరెస్స్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, భారత్ జాగృతి నేతలు, బీఆరెస్స్ కార్యకర్తలు చేరుకున్నారు. దర్యాప్తు సంస్థల తీరుకు నిరసనగా ఢిల్లీలో బీఆరెస్స్ శ్రేణులు ఆందోళన చేసే అవకాశం ఉందని పోలీసులు భావించారు. దీంతో ఈడీ ఆఫీసు చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంతలోనే.. కవిత నుంచి ఈ సమాచారం వచ్చింది!