Munugode By-Poll: ఉంగరాల పాల్ బాబు.! మునుగోడు బై పోల్‌లో హల్‌చల్.!

Munugode By-Poll: మునుగోడు ఉప ఎన్నికలో ప్రధాన రాజకీయ పార్టీలతో సమానంగా కిలారి ఆనంద్ పాల్ అలియాస్ కేఏ పాల్ కూడా కష్టపడ్డారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు అయిన కేఏ పాల్, మునుగోడులో తాను గెలిచేస్తానంటున్నారు. ప్రచారం ముగిసింది.. ‘పోలింగ్ డే’ రానే వచ్చేసింది.

పోలింగ్ బూత్‌లలో కూడా కేఏ పాల్ సందడి చేస్తున్నారు. అన్ని వేళ్ళకీ ఉంగరాలు పెట్టి మరీ కేఏ పాల్ పోలింగ్ బూత్‌లలో తిరుగుతోంటే, మీడియా ఆయన్ని ప్రశ్నించింది. ‘మీ ఎన్నికల గుర్తు ఉంగరం. ఆ ఉంగరాల్ని పెట్టుకుని పోలింగ్ బూత్‌లోకి వెళ్ళడం నిబంధనల ఉల్లంఘన కాదా.?’ అని మీడియా ప్రశ్నిస్తే, చిత్రమైన సమాధానమిచ్చారు కేఏ పాల్.

‘తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల గుర్తు కారు.. వారు కార్లలో కాకుండా వేరే వాహనాల్లో రాగలరా.?’ అని పాల్ ప్రశ్నించేశారు. కార్లలో అయితే పోలింగ్ స్టేషన్ వరకూ రాగలరేమోగానీ, పోలింగ్ బూత్‌లోకి వెళ్ళలేరు కదా.! ఉంగరాలు ధరించి పోలింగ్ బూత్‌కి రాకూడదన్న నిబంధన ఏదీ లేదు. సో, కేఏ పాల్‌కి ఈ విషయంలో పెద్దగా ఇబ్బంది వుండకపోవచ్చు.

కాగా, మునుగోడు బై పోల్ ప్రచారం సీరియస్‌గా సాగితే, కిలారి ఆనంద్ పాల్ మాత్రం కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చి.. ఆ ఉప ఎన్నిక వేడిని.. కాస్త తగ్గించే ప్రయత్నం చేశారు. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేఏ పాల్ కూడా బాగానే జనంలోకి తూసుకెళ్ళారు. కేఏ పాల్ ఎన్ని ఓట్లు మునుగోడులో సాధిస్తారోగానీ, ఆయన కష్టానికి బాగానే ఫలితం దక్కాలి. డిపాజిట్ దక్కించుకుంటారా మరి ఈ శాంతిదూత.?