KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన జోలికి వస్తే సహించేది లేదని, వారం రోజుల్లో తన సత్తా ఏంటో చూపిస్తానని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేఏ పాల్ మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీకి పూర్తిగా సరెండర్ అయ్యారు. ఆయన 120 ఏళ్లు బతుకుతానంటున్నారు. కానీ నేను తలుచుకుంటే 125 రోజుల్లోనే పైకి పోతారు. నా ప్రేయర్ బుక్కులో అందరి పేర్లు రాసుకున్నాను” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన ఛారిటీ సంస్థల జోలికి రావొద్దని, చంద్రబాబుకు వారం రోజుల సమయం ఇస్తున్నానని, ఆ తర్వాత అందరి లెక్కలు తీరుస్తానని హెచ్చరించారు.
పవన్ కల్యాణ్ ఒక ప్యాకేజ్ స్టార్ అని, డబ్బులకు అమ్ముడుపోయారని కేఏ పాల్ ఆరోపించారు. మరోవైపు నారా లోకేశ్ తన నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. “ఒకవైపు జగన్, మరోవైపు లోకేశ్.. వాళ్ల తండ్రులను చూసుకుని రెచ్చిపోతున్నారు. నేను రంగంలోకి దిగితే అందరి సంగతి తేలుస్తా” అని మండిపడ్డారు.
ఈ సమావేశంలో సుగాలి ప్రీతి కేసును తాను సీరియస్‌గా తీసుకుంటున్నానని పాల్ ప్రకటించారు. గతంలో నిమిషా కేసును ఎలాగైతే కొలిక్కి తెచ్చానో, అదే విధంగా సుగాలి ప్రీతికి న్యాయం జరిగే వరకు పోరాడతానని స్పష్టం చేశారు. ఇటీవల మరణించిన పాస్టర్ ప్రవీణ్ పగడాలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన ఖండించారు. “పాస్టర్ ప్రవీణ్ మద్యం తాగడం మీరు చూశారా? లేక మీరేమైనా ఆయనకు మద్యం పోశారా?” అంటూ చంద్రబాబును ప్రశ్నించారు.
కేఏ పాల్ ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపాయి.


