హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రకటన నేపథ్యంలో అధికార పార్టీలకు చెందిన కొందరు నేతలు ఉన్నట్టుండి అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు చేయటం మొదలెట్టేసారు. రాబోయే ఎన్నికలలో గెలిచేందుకు ఇదొక వ్యూహం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తన ఫరిధిలో అనేక చోట్ల కమ్యూనిటీ హాల్స్ శంకుస్థాపన కార్యక్రమాలకి హాజరయ్యారు. అయితే పనిలో పనిగా వరద సాయం గురించి ఆరా తీసేందుకు మీ-సేవ సెంటర్కు వచ్చిన ఎమ్మెల్యేకు ఒక చేదు అనుభవం ఎదురైంది.హైదరాబాద్ లో వరద సాయం పక్కదారి పట్టిన వ్యవహారంపై ఆగ్రహావేశాలతో ఉన్న భాదితులు మాగంటి గోపీనాథ్ కి చెప్పులు చూపెట్టి తమ నిరసన తెలియజేశారు. దీంతో వెంటనే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.
హైదరాబాద్లో వరదల వల్ల నష్టపోయిన వారికి సాయం అందించడంలో ఆయన పక్షపాతం చూపిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. దీంతో వరద బాధిత మహిళలతో ఎమ్మెల్యే అనుచరులు వాగ్వాదానికి దిగారు. మీ సేవా సెంటర్ల వద్ద వరద బాధితులు క్యూ కడుతున్నారు. ఒక్కో దరఖాస్తుకు మీ సేవా సిబ్బంది రూ.200 వసూలు చేస్తున్నారని వారు అంటున్నారు. సిబ్బంది కొరత, సర్వర్లు మొరాయించడంతో మీ-సేవ నిర్వహకులు దరఖాస్తులు ఆలస్యం అవుతోందని అంటున్నారు. వరద సాయం అకౌంట్లో జమ చేయాలంటూ బాధితులు ఆందోళనకు దిగుతున్నారు.