షాకింగ్ : ఈ టిఆర్ఎస్ ఎమ్మెల్యేకు కొత్త టెన్షన్ (వీడియోలు)

నల్లగొండ జిల్లాలోని మునుగోడు టిఆర్ఎస్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఇరకాటం వచ్చి పడింది. ఆయన నియోజకవర్గం పరిధిలోని గట్టుప్పల్ అనే గ్రామాన్ని మండలంగా మార్చాలంటూ గడిచిన 649 రోజులుగా జనాలు నిరహారదీక్షలు చేస్తున్నారు. బట్టి ఆరకుండా నిప్పు రాజేస్తున్నారు. తమకు మండల కేంద్రాన్ని ఇచ్చినట్లే ఇచ్చి గుంజుకున్నారని వారు రగిలిపోతున్నారు. రెండేళ్లుగా దీక్షా శిబిరంలో పెద్ద సంఖ్యలో జనాలు పాల్గొని ఆందోళన చేస్తున్నారు. గత దసరా కాకుండా అంతుముందు దసరా రోజు తెలంగాణలో జిల్లాల విభజన జరిగింది. కొత్త మండలాలు, కొత్త జిల్లాలు మనుగడలోకి వచ్చాయి. ఆ సందర్భంలో మునుగోడులో ఉన్న గట్టుప్పల్ గ్రామాన్ని మండల కేంద్రంగా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అన్ని మండలాల మాదిరిగానే ఎమ్మార్వో ఆఫీసు, ఎంపిడిఓ ఆఫీసు, పోలీసు స్టేషన్ ఇలా అన్ని మండల ఆఫీసులను సిద్ధం చేసి బోర్డులు కూడా తగిలించారు.

 

కానీ ఏమైందో ఏమో ఆ మండలాన్ని కాకి ఎత్కపోయినట్లు పాలకులు ఎత్కపోయారు. రాత్రికి రాత్రే మండలం రద్దు అయింది. బోర్డులన్నీ పీకేశారు. మండలాన్ని ఇచ్చినట్లే ఇచ్చి రద్దు చేయడంతో జనాల కడుపు మండింది. దీంతో వారంతా అప్పటి నుంచి రకరకాల పద్ధతుల్లో ఆందోళన సాగిస్తున్నారు. నిరహారదీక్షా శిబిరం ఏర్పాటు చేసి రోజూ దీక్షలు చేస్తున్నారు. వారి దీక్షా శిబిరాన్ని తెలంగాణ ఉద్యమ నేత, జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం కూడా సందర్శించి వారికి మద్దతు పలికారు. మండలాన్ని రాత్రికి రాత్రే రద్దు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే నిరహారదీక్షను 649 రోజులు చేసినా పాలకులు స్పందించలేదు. స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కానీ, పార్టీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కానీ, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి కానీ పట్టించుకోలేదు. ఈ అంశంపై వారు కంటితుడుపుగానే స్పందించారు తప్ప సిఎం కేసిఆర్ మీద వత్తిడి తెచ్చి మండలాన్ని తిరిగి ఇప్పించే ప్రయత్నం చేయలేకపోయారు.  ఈ పరిస్థితుల్లో మండల సాధన కోసం ఇంతకాలం చేసిన నిరహారదీక్షను ఆమరణ నిరహారదీక్షగా మారుస్తున్నట్లు గట్టుప్పల్ మండల సాధన సమితి ప్రకటించింది. తమ నిరహారదీక్షతో అయినా ప్రభుత్వం కండ్లు తెరిచి మండలాన్ని ఇస్తుందని వారు భావిస్తున్నారు.

మరోవైపు మండల సాధనలో స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ ఆమరణ దీక్ష షురూ చేసినట్లు  ఉద్యమకారులు  అంటున్నారు. మరి అసలే ఎన్నికల ఏడాది.. పైగా టికెట్ వస్తుందో రాదో అన్న బెంగ ఉన్నది ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి. మరి ఈ పరిస్థితుల్లో ఈ దీక్షా కార్యక్రమం ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి కొత్త నెత్తినొప్పి తెచ్చి పెట్టిందని జనాలు అంటున్నారు. ఈ గండం నుంచి ఎమ్మెల్యే ఎట్లా గట్టెక్కుతారో చూడాలి. ఆమరణ దీక్ష తర్వాత సాధన సమితి ప్లాన్ ఏంటో కూడా త్వరలోనే తేలనుంది. గట్టుప్పల్ మండల సాధన సమితి నేతలు శుక్రవారం రిలే నిరహార దీక్షా శిబిరంలోనే నివధిక నిరహారదీక్షలకు కూర్చున్నారు. వారు ఏమంటున్నారో పైన రెండు వీడియోలు ఉన్నాయి చూడండి.