నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ ఆశీర్వాద సభలో కేసిఆర్ ఘాటైన పదజాలంతో, కరుకు విమర్శలతో, ముత్క మాటలతో సుదీర్ఘంగా ప్రసంగించారు. కేసిఆర్ ప్రసంగం మొదలు కాగానే అభ్యర్థులను పరిచయం చేసే సమయంలో భూపాల్ రెడ్డి పేరు తీసుకుని ఆయనను సభకు పరిచయం చేశారు కేసిఆర్. ఈ సందర్భంగా జనాలు ఈలలు, కేకలతో హోరెత్తించారు. తర్వాత మిగతా వారిని కూడా పరిచయం చేశారు. అప్పుడు కూడా సభలో ఈలలు, కేకలు వేశారు. అయితే కంచర్ల భూపాల్ రెడ్డికి జరంత ఎక్కువ ఈలలు, కేకలు వేశారు. అప్పుడు కేసిఆర్ స్పందించి భూపాల్ రెడ్డి గాలి బాగా వీస్తుందన్నమాట అని చమత్కరించారు.
ఇక సభలో కేసిఆర్ ప్రసంగం మధ్యలో ఉండగానే ఆయన గొంతు బొంగురుబోయింది. సర్దుకునే ప్రయత్నం చేసినా చాలాసేపు బొంగురు గొంతుతోనే కేసిఆర్ ప్రసంగం సాగింది. అయితే ఆయన ప్రసంగం ప్రారంభించినప్పటి నుంచి చాలాసేపటి వరకు బొంగురు గొంతు ఇబ్బంది పెట్టింది. తర్వాత గొంతు సాఫ్ అయింది. స్పీచ్ దంచి కొట్టిండు. సభలో మాట్లాడుతున్న సమయంలోజనాలు ఈలలు, కేకలు వేస్తూ కేసిఆర్ కు ఆగ్రహాన్ని తెప్పించారు. దీంతో కేసిఆర్ ఒక దశలో ‘‘సీటి బంద్ చేయరాదయ్యా.. సీటి బంద్ చేయిరి.. మీటింగ్ అయిపోయినంక అందరం కలిసి గట్టిగ కొడదాం లే సీటి.. మంచి ముచ్చట చెప్తుంటే ఇనాలె కానీ సీట్లేందయా’’ అని వారి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక సభలో మంత్రి జగదీష్ రెడ్డి గురించి ఒక సందర్భంలో చెబుతూ జగదీష్ రెడ్డి గురించి సెటైర్చూ వేశారు. ఆ సమయంలో ఏమన్నాడంటే…
‘‘పెద్ద పెద్ద మాటలు మాట్లాడే చెత్త నాయకులంతా మీ నల్లగొండ జిల్లాలోనే ఉన్నరు. ఏనాడూ విద్యుత్ ప్రాజెక్టు కట్టాలన్న ఆలోచన చేయలేదు ఈ నాయకులు. అన్ని విద్యుత్ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణలోనే ఉన్నాయి. దక్షిణ తెలంగాణలో లేవు. ఎన్టీఆర్ హయాంలో బొగ్గు రవ్వ కూడా దొరకని రాయలసీమలో మద్దనూరు పవర్ ప్రాజెక్టు కట్టినారు. నల్లగొండలో నాయకులు లేరా? ఎత్తు తక్కువున్నరా? పొడుగు తక్కువున్నరా? ఒక్కడు కూడా నోరు తెర్వలేదు. నల్లగొండ ఎమ్మెల్యే ఉల్క మీద రోకలోలిగ దునుకుతడు.
ఈ రోజుఈ జిల్లాకు ఉన్న విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు జానారెడ్డి అంత ఎత్తు లేకపోవచ్చు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంత పొడుగు లేకపోవచ్చు. మీటరంత ఎలుము లేదు కావొచ్చు. జగదీష్ రెడ్డి పొట్టి వాడే కానీ చానా గట్టివాడు. నాతోని కొట్లాడి అన్నా దక్షిణ తెలంగాణలో ఒక విద్యుఛ్చక్తి ప్లాంటు లేదు. నల్లగొండలో విద్యుత్ ప్లాంట్ పెట్టాలె అన్నా అని చెప్పినాడు. కృష్ణా నదిలో టెయిల్ పాండ్ పూర్తయింది. నీళ్లు పుష్కలంగా ఉన్నాయి అని చెప్పినాడు.
ఈ జానారెడ్డి తేలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి తేలే. కానీ ఇయ్యాల పెద్ద ఆల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ను బక్క పేద టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బక్క పేద మంత్రి జగదీష్ రెడ్డి తెచ్చిర్రు. 29వేల కోట్ల పెట్టుబడితోని 4వేల మెగవాట్ల థర్మల్ పవర్ విద్యుత్ ప్లాంట్ దామరచర్ల వద్ద కడుతున్నాం. ఈ గంటలో వెయ్యి మంది అక్కడ పనిచేస్తా ఉన్నారు. జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కల కూడా పడలేదు. సోయి కూడా రాలే.
30వేల కోట్ల రూపాయలు తెచ్చి మేము ప్రాజెక్టు కడుతున్నాం. 8వేల మంది ఉద్యోగస్తులు వస్తరు అక్కడ. పెద్ద టౌన్ షిప్ వస్తది. నల్లగొండ జిల్లా ముఖచిత్రమే మారిపోతది. మేము తెస్తే. కష్టపడి ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ తెస్తే ట్రిబ్యూనల్ కు పోయి స్టే తెచ్చారు. ఎందుకంటే మా మొఖం చెల్లదు అని స్టే తెచ్చారు. ఈ జిల్లా ప్రజలకు గుణపాఠం చెప్పాలె.’’ అని చమత్కరించారు కేసిఆర్.