టీడీపీ కంటే జనసేన బెటర్.!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కాదిది.! తెలంగాణ రాజకీయాల గురించి. తెలంగాణలో ఎన్నికల సందడి గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఎన్నికల నగారా మోగేసింది. ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తదితర పనుల్లో బిజీగా వున్నాయి.

చిత్రంంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో స్తబ్దుగా వుంది. అధినేత చంద్రబాబుని, ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ సర్కారు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టు చేయించి, లోపలేయించింది. దాంతో, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలా.? వద్దా.? అన్నదానిపై తెలంగాణ టీడీపీకి ఖచ్చితమైన సమాచారమే లేకుండా పోయింది.

వాస్తవానికి, తెలంగాణలో టీడీపీకి ఒకప్పుడు బలమైన నాయకులు, క్యాడర్ వుండేది. అయితే, అదంతా గతం. ఇప్పటికీ కొందరు కరడుగట్టిన కార్యకర్తలు టీడీపీ కోసం వున్నా, నాయకత్వ లోపం సుస్పష్టం.

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, తెలంగాణలో పార్టీని మూసేసుకుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ స్థానంలో వైఎస్ షర్మిల ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ’ పేరుతో హడావిడి చేసేందుకు గత కొన్నాళ్ళుగా ప్రయత్నిస్తున్నా, ఆమె జాడ కూడా తెలంగాణ ఎన్నికల్లో కనిపించడంలేదు.

వున్నంతలో జనసేన పార్టీ కాస్త బెటర్. 32 సీట్లలో పోటీ చేస్తామని జనసేన ప్రకటించింది. బీజేపీ – జనసేన మధ్య మైత్రి మళ్ళీ చిగురిస్తోంది తెలంగాణలో. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి 20కి పైగా సీట్లను జనసేన ఆశిస్తోందట. పది సీట్ల వరకూ ఇస్తామని బీజేపీ అంటోందిట.

బీజేపీ – జనసేన మైత్రి ఎన్నికల కోసం కుదిరితే, టీడీపీ సంగతేంటి.? అసలంటూ తెలంగాణ టీడీపీ నాయకత్వమే ఎక్కడా కనిపించడంలేదాయె.! మరీ ఇంత దారుణమా.? అంటూ, తెలంగాణ తెలుగు తమ్ముళ్ళు గుస్సా అవుతున్నారు.