కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జనగాం జిల్లా కీలక నేతలు

కాంగ్రెస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీలో ఘోర వైఫల్యం చెందిన కాంగ్రెస్ పార్టీ ఇంకా తేరుకోకముందే జనగాం జిల్లాకు చెందిన కీలక నేతలు రాజీనామా చేశారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కొంత మంది నేతలు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

జనగాం జిల్లాకు చెందిన కీలక నాయకులు కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. జనగాం జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దిరాం రెడ్డి, పట్టణ అధ్యక్షుడు గుర్రపు బాల్ రాజు, మండల ఉపాధ్యక్షుడు అమీజ్ తో పాటు వారి అనుచరులు పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వారు ఏమన్నారంటే…

“ 2014 లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటి నుంచి కూడా పార్టీని నమ్ముకునే పని చేసినం. పదవులు లేకున్నా పార్టీని నమ్ముకొని ఉన్నాం. అధికార పార్టీ నుంచి ఎన్ని ప్రోద్బలాలు వచ్చినా వాటికి లొంగకుండా పార్టీలోనే ఉన్నాం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పార్టీ వారు నిర్ణయించిన అభ్యర్దులకు మద్దతిచ్చి పార్టీ గెలుపు కోసం పని చేశాం. స్వంత పైసలు పెట్టుకొని ప్రచారం నిర్వహించాం.

కొంత మంది ఇంచార్జ్ ల పేరుతో మాకు అన్యాయం చేస్తున్నారు. ప్రతి దానికి కూడా వారిని సంప్రదించాలంటున్నారు. వారికి తెలియకుండా ఏ పని చేయవద్దట. జిల్లా స్థాయి పదవులలో ఉన్నా కూడా ఇంచార్జ్ లను ఎందుకు సంప్రదించాలి. ఇన్నేళ్ల నుంచి లేని వారు ఇప్పుడొచ్చి పెత్తనం చెలాయిస్తున్నారు. దీనిని మేం వ్యతిరేకిస్తున్నాం. మాకు గుర్తింపు లేని దగ్గర మేమేందుకు పని చేయాలి. టిపిసిసి దృష్టికి తీసుకెళ్లినా కూడా స్పందన లేదు. 

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు

పార్టీ మీద నమ్మకంతో, విశ్వాసంతో ఇన్ని రోజులు పనిచేశాం. ఇక ఈ ఇంచార్జీల లొల్లి పడలేం. అందుకే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ పెద్దలు అసలు నిజం తెలుసుకొని చర్యలు బాధ్యుల పై చర్యలు తీసుకోవాలి. లేకపోతే పార్టీ మరింత దిగజారే ప్రమాదం ఉంది. మేం ఏ పార్టీలో చేరుతామనే విషయం పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే ప్రకటిస్తాం”. అని కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశంలో తెలిపారు.

రెండు రోజుల కిందనే ఉమ్మడి కాంగ్రెస్ జడ్పీ ఫ్లోర్ లీడర్ వెంకన్న కాంగ్రెస్ కు రాజీనామా చేసి కారు ఎక్కనున్నారని వార్తలు వచ్చాయి. ఆయన అధికారికంగా చేరకపోయిన ఆయన చేరిక లాంఛనమే అయ్యింది. ఆ షాక్ నుంచి తేరుకోకముందే జనగాం జిల్లా కీలక నేతలు చేజారడంతో కాంగ్రెస్ క్యాడర్ లో కలవరం నెలకొంది. హైకమాండ్ ఏ విధంగా దిద్దుబాటు చర్యలు చేపడుతుందో అని అంతా చర్చించుకుంటున్నారు.