(యనమల నాగిరెడ్డి)
డిసెంబర్ 7 వ తేదీన జరుగనున్న తెలంగాణ ఎన్నికలలో వైస్సార్ పార్టీ అధినేత వై .ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మౌనంగా ఉండటం ఆ పార్టీ కార్యకర్తల్లోనూ, సానుభూతిపరుల్లోనూ తీవ్ర అయోమయం సృష్టిస్తున్నది. తమ అధినేత లాగే తాము కూడా ఈ ఎన్నికలలో మౌనం పాటించాలా? లేక చంద్రబాబు పుట్టించిన మహా కూటమికి వ్యతిరేకంగా పనిచేయాలా? అన్నది తేల్చుకోలేక తాము సతమతమవుతున్నామని వారు వాపోతున్నారు. రాజకీయ చదరంగంలో చంద్రబాబు వేస్తున్న జిత్తులమారి ఎత్తులకు వైస్సార్ పార్టీ అధినేత సరైన ప్రతిఎత్తులు సకాలంలో వేయలేకున్నారని వారు వాపోతున్నారు.
చంద్రబాబు జిత్తులమారి ఎత్తులు
2014 లో జరిగిన రాష్ట్ర విభజనకు ముందు రెండుకళ్ల సిద్ధాంతం చెప్పిన చంద్రబాబు అటు తెలంగాణాను, ఇటు ఆంద్ర ప్రాంతాల ప్రజలను అయోమయంలో ముంచగలిగారు. తెలంగాణా ఏర్పాటుకు అనుకూలంగా లేఖ వ్రాశి తెలంగాణా వారిని, రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ కారణమంటూ ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్ట గలిగారు.
2014కు ముందు జరిగిన కడప పార్లమెంటు స్థానానికి జరిగిన ఉపఎన్నికలలో “బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తన రాజకీయ జీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటని, తాను జీవితంలో మరో సారి ఈ పొరపాటు చేయనని” విస్పష్టంగా అనేక సార్లు ప్రకటించారు. ఆనతి కాలంలోనే ప్లేటు ఫిరాయించి 2014 ఎన్నికలలో “వెంకయ్యనాయుడి సహకారం, ప్రకాష్ జవదేకర్ చలవతో” బీజేపీ వెంటపడి పొత్తు పెట్టుకున్నారు. దేశ భవిష్యత్తును నాశనం చేసిన “భ్రష్ట,దుష్ట”కాంగ్రెస్ ను సాగనంపడం కోసమే తాను బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నానని నిస్సిగ్గుగా ప్రకటించి పబ్బం గడుపుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికలలో సున్నా స్థానం నుండి ఆయన తన ప్రస్థానం ప్రారంభించి, బీజేపీ, పవన్ కళ్యాణ్ చలవతో అతి తక్కువ తేడాతో అందలం ఎక్కారు.
బీజేపీ, పవన్ మద్దతు తో పాటు జగన్ మితిమీరిన అహంకారం, అతి విశ్వాసం కూడా బాబు ఆ ఎన్నికలలో గటెక్కడానికి ఉపయోగపడ్డాయి.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు శివరామకృష్ణన్ కమిటీ నిర్ణయాలకు వ్యతిరేకంగా తనకు అనుకూలంగా “రాజధాని నిర్మాణ ప్రాంతం ఎంపిక చేసుకోవడానికి , జాతీయ ప్రాజెక్ట్ గా ఉన్న పోలవరం పనులను తన చేతిలోకి తీసుకోవడానికి, రాష్ట్రానికి ప్రత్యేక హోదాను వదలి ప్రత్యేక ప్యాకేజి పేరుతొ నిధులు పొందడానికి ” ఇలాంటి అతి ముఖ్యమైన పనులను సాధించుకోవడానికి బీజేపీ పంచ గట్టిగా పట్టుకున్నారు. వెంకయ్య అండదండలతో తానూ అనుకున్నవి సాధించుకున్నారు.
తర్వాత తన వాయిద్యానికి అనుగుణంగా ప్రధాని మోడీ, బీజేపీ డాన్స్ చేయడంలేదని, తననే డాన్స్ చేయించడానికి బీజేపీ స్కెచ్ వేసిందని గ్రహించిన వెంటనే బాబుగారు మరోసారి ‘యూ’ టర్న్ తీసుకుని బీజేపీ పై యుద్ధానికి దిగారు.
ప్రజలను తనకనుగుణంగా ట్యూన్ చేసుకోడానికి ముందు బీజేపీతో కలసి ‘నవనిర్మాణ దీక్షలు, ఆ పార్టీ తో విడిపోయి ‘ధర్మపోరాటదీక్షలు’ చేసారు. బీజేపీ దాడి నుండి తాను రక్షణ పొందడానికి, తన అంతేవాసులను కాపాడటానికి ఏకంగా ప్రధానిపై యుద్ధం ప్రకటించి “దేశ రాజకీయాలకు దిశా నిర్దేశం చేయనున్నానని” చేప్పుకుంటూ, బీజేపీ పార్టీ పై అసంతృప్తితో ఉన్న అన్ని పార్టీలను కలపడానికి గడప గడప తిరుగుతూ కాంగ్రెస్ కొంగు పట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో కేసీఆర్ తెచ్చిన ముందస్తు ఎన్నికలనే అస్త్రంగా చేసుకుని “చంద్రబాబుమహాకూటమి” ని ఏర్పాటు చేసారు. “ ఓటుకు నోటు కేసుకు బోంద పెట్టడం, కాంగ్రెస్ ను గుప్పెట్లో పెట్టుకుని జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనేది” బాబు వ్యూహంగా రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. చంద్రబాబు రాజకీయ మనుగడకు మహాకూటమి గెలుపు ప్రస్తుతానికి అత్యవసరంగా మారిన నేపథ్యంలో “దిశా దశ లేని కాంగ్రెస్ కు ఆర్ధికబలం, అంగబలం” పుష్కలంగా అందించి తెలంగాణ ఎన్నికలే వేదికగా తన వాణి వినిపిస్తూ, తెరాస ను ఓడించడానికి కంకణం కట్టుకుని తిరుగుతున్నారు.
ఎత్తుగడలు (వేయ) లేని జగన్
ఈ నేపథ్యంలో వైస్సార్ పార్టీ అధినేత జగన్ ఎందుకు మౌనం పాటిస్తున్నారనేది తెలంగాణాలో ఉన్న ఆ పార్టీ కార్యకర్తలను, సానుభూతిపరులను వేధిస్తున్న ప్రశ్న. తెలంగాణా ఎన్నికలలో దూసుకువెళుతున్న చంద్రబాబు వ్యూహాలకు సరైన ప్రతివ్యూహాలు వేయడంలో జగన్, ఆయన అంతేవాసులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పక తప్పదు.
“ఆంద్ర రాజధాని నిర్మాణ స్థలం ఎంపికలో చంద్రబాబు ఉచ్చు” లో చిక్కుకున్న జగన్ మోహన్ రెడ్డి, ఆ తర్వాత ఏ సమయంలో కూడా బాబుకు దీటుగా ప్రతిస్పందించలేదనే చెప్పవచ్చు.
కోస్తా పెద్దల మనసు నొప్పించకుండా ఉండాలనే ఏకైక ఉద్దేశ్యంతో రాయలసీమ ప్రాజెక్టులకు ప్రభుత్వం నిధులివ్వకున్నా, నిర్మాణంలో అలసత్వం ప్రదరిస్తున్నా తిరగబడలేదు. బ్రిజేష్ మిశ్ర ట్రిబ్యునల్ ఎదుట ప్రభుతం రాయలసీమ అవసరాలగురించి మాట్లాడుకున్నా నోరెత్తడంలేదు. ఇప్పటి వరకు అన్ని అంశాలకు జగన్ ఉపయోగిస్తున్న ఒకే ఒక తారక మంత్రం “ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చేస్తాం”. ( అన్నిటికీ సమయం మించిపోతే ఎం చేస్తారో తెలియలేదు).
ఇక రాజకీయంగా బీజేపీతో అంటకాగిన బాబు వైస్సార్ పార్టీ బీజేపీకి తొత్తుగా మారిందని గత ఆరు నెలలుగా ఆరోపిస్తున్నా పట్టించుకోవడంలేదు. “ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా” అంటూ గొంతు చించుకుని నాలుగేళ్లుగా అరచిన జగన్ ప్రస్తుతం అదే నినాదాన్ని చంద్రబాబుగొంతు మార్చి భుజానికి ఎత్తుకుంటే” సమర్థవంతంగా తిప్పి కొట్టలేకపోయారు.
కాంగ్రెస్ నుండి విడిపోయి పుట్టిన వైస్సార్ పార్టీ రేపు 2019 ఎన్నికలలో గెలిచినా కాంగ్రెసుతో కలవడానికి (ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామనిప్రకటించినా )వీలు లేకుండా చంద్రబాబు వేసిన ఎత్తుకు చిత్తయింది. ఏపీలో రాజకీయంగా జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి కాంగ్రెసుతో చేతులు కలిపిన బాబు ఎత్తుకు వైస్సార్ పార్టీ అధినేత దిక్కుతెలియని స్థితిలో పడ్డారు.
2019 ఎన్నికలలో టీడీపీతో కలసి వైస్సార్ పార్టీని ఓడిస్తే “గత ఏడు సంవత్సరాలుగా స్వంత ఖర్చులతో వైస్సార్ పార్టీ పార్టీ జెండా మోసిన మాజీ కాంగ్రెస్ నాయకులందరికి తమపార్టీనే దిక్కవుతుందని”, ప్రస్తుతానికి టీడీపీతో కలసి వైస్సార్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం వేసిన ఎత్తుగడలను కూడా జగన్ పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదు.
ప్రస్తుతానికి వస్తే తెలంగాణా ఎన్నికలలో తనదైన శైలిలో బాబు దూసుకు వెళుతున్నారు. బాబు దూకుడుకు కళ్లెం వేయడానికి లేదా అడ్డుకోవడానికి వైస్సార్ పార్టీ ఇప్పటి వరకు ఎలాంటి ఎత్తు వేయలేదని, ఇది పార్టీకి, జగన్ కు భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టగలదని ఆ పార్టీ సానుభూతిపరుడు ప్రతాప్ తెలుగు రాజ్యం ప్రతినిధితో వాపోయారు.
రాష్ట్రంలోని నియోజకవర్గాలలో వైస్సార్ పార్టీ సానుభూతిపరులు ఏడెనిమిది వేలమంది ఉన్నారని, అలాగే ప్రత్యేకించి జంట నగరాలలోని నియోజకవర్గాలలో పది వేలకు మించి అభిమానులున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. వారంతా అయోమయంలో ఉన్నారని, పార్టీ వారికి దిశా నిర్దేశం చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారని ప్రతాప్ తెలిపారు.
ఏపీలో ఏది ఏమైనా తామే గెలుస్తామన్న ధీమాతో జగన్ మౌనం పాటిస్తున్నారేమో తెలియదు కానీ చంద్రబాబు దూకుడును అడ్డుకోవడానికి, భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసం జగన్ ఇప్పటికైనా నోరు తెరచి “మహాకూటమిని” ఓడించమని తన అభిమానులకు, పార్టీ సానుభూతి పరులకు పిలుపు నివ్వాలని, తాను మాట్లాడిన అనేక మంది వైస్సార్ అభిమానులు అంటున్నారని ప్రతాప్ వివరించారు.
అదే రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉండి ఉంటె ధీటైన వ్యూహాలతో చంద్రబాబు ఆటలకు ఎప్పుడో అడ్డుకట్ట వేసేవారని వారు గుర్తు చేశారు. ఆయన రాజకీయ వారసత్వాన్ని ఆశించిన జగన్ మోహన్ రెడ్డి ఎత్తుగడలు వేయడంలో కూడా ఆయన తండ్రినే ఆదర్శంగా తీసుకుని ధైర్యంగా ముందుకు సాగాలని వారు కోరుతున్నారు. ఈ ఎన్నికలలో జగన్ ‘తన భవిష్యత్తు కోసం’ బాబును అడ్డుకోవాలని, తెలంగాణ రాజకీయాలపై ద్రుష్టి సారించాలని వారు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాజకీయాలపై నిర్ణయం తీసుకోవడానికి ఇప్పటికీ సమయం మించి పోలేదని ఆయన అన్నారు.
బాబు అల్లుతున్న రాజకీయ సాలెగూడు నుండి జగన్ బయటపడతారా? లేదా? చూడాల్సిందే.