ఆంధ్రప్రదేశ్ ప్రజలు డిమాండ్ చేస్తున్న ప్రత్యేక హోదాకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మద్దతు నీయడం తప్పా అని వైఎస్ ఆర్ ఎసి కాంగ్రెస్ నేత జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు.
ఈ రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆయన రోడ్ షో నిర్వహించి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు మీద దాడి తీవ్రతరం చేశారు.
తాడిపత్రి నియోజకవర్గం తెలుగుదేశానికి చెందిన జెసి బ్రదర్స్ జాగీరు లాంటిది. ఈ జాగీరు కైవసం చేసుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.బహాశా జగన్ దృష్టి నిలిపిన కీలకమయిన నియోజవర్గాలలో తాడిపత్రి ఒకటి కావచ్చు. రకరకాలుగా జగన్ మీద దాడులుచేసి చంద్రబాబు మెప్పు పొందిన జెసి బ్రదర్స్ ఈ సారి తాము రాజకీయాల్లో ని రిటైరయి కొడుకులను ఎన్నికల్లో నిలబెట్టారు. అయితే, జగన్ రోడ్ షో కు వచ్చిన జనాన్ని చూస్తే కళ్లు చెదిరిపోతాయి. తాడిపత్రి చరిత్రలో ఇంత పెద్ద రోడ్ షో జరగలేదు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే కాదు, జెసి బ్రదర్స్ హాయంలో తాడిపత్రి ఎలా ఉందో కూడా జగన్ చెప్పారు.
‘‘ వైయస్సార్ రూ.284 కోట్లతో చాగల్లు ప్రాజెక్టు చేపట్టి, దాదాపు 80 శాతం ఆయన పనులు పూర్తి చేశాడు.
రూ.102 కోట్లతో నాడు చేపట్టిన పెండేకల్లు ప్రాజెక్టు ఇవాళ్టికి కొనసాగుతోంది. ఇక్కడ గ్రానైట్ పరిశ్రమలు దారుణంగా దెబ్బతిన్నాయి. 750 యూనిట్లలో చాలా వరకు మూతబడ్డాయి. దాదాపు 20 వేల మంది వీధిన పడ్డారు. నియోజకవర్గంలో దౌర్జన్యాలు మితిమీరిపోయాయి. ఒక నియంత పాలనలో మాదిరిగా ఇక్కడి పరిస్థితి ఉంది.– చంద్రబాబు దగ్గరుండి హత్యలు చేయిస్తున్నారు. రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారు.
– పెదవడుగూరు మండలంలో కృష్ణపాడు సింగిల్‌విండో అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డిని దారుణంగా ఆఫీసులోనే 2015లో చంపారు,’ అని జగన్ అన్నారు.
తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్ తనకు వేయి కోట్లరుపాయలిచ్చారని తెలుగుదేశం అండ్ కో చేస్తున్న విమర్శలకు కూడా ఆయన వివరణ ఇచ్చారు.
‘తెలంగాణ సీఎం కేసీఆర్, జగన్‌కు మద్దతు ఇచ్చారని, రూ.1000 కోట్లు ఇచ్చారని చంద్రబాబు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. చంద్రబాబు పార్టనర్ కూడా అవే మాట్లాడుతున్నాడు. ఎల్లో మీడియా కూడా సిగ్గు లేకుండా దాన్నే ప్రచారం చేస్తోంది. అయ్యా చంద్రబాబు, ఆయన రూ.1000 కోట్లు ఇస్తుండగా నీవేమైనా చూశావా? లేక కేసీఆర్ గారు నీకేమైనా ఫోన్ చేసి జగన్‌కు రూ.1000 కోట్లు ఇచ్చానని చెప్పారా?,’ అని ప్రశ్నిస్తూ, ‘‘ కేసీఆర్ మద్దతు ఇస్తోంది మాకా? లేక ప్రత్యేక హోదాకా? కేసీఆర్ ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తుంటే చంద్రబాబుకు ఎందుకు అంత అభ్యంతరమో,’ చెప్పాలని జగన్ అడిగారు.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు వేరే రాష్ట్రాలు మద్దతు ఇస్తున్నాయి. మరి మరొకరు ఇవ్వవద్దా? అని అన్నారు.
తాను బాగా పాలించానని ధైర్యంగా చెప్పుకుంటూ ఓటు వేయండి అని చంద్రబాబు అడగలేకపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
‘ తన పాలన చూపి ఓడగడం చేత కాక, లేనిపోనివి ప్రచారం చేస్తున్నారు. జగన్ అధికారంలోకి వస్తే ఏదో జరుగుతుంది. ఇంకేదో జరుగుతుంది. అంటూ రోజుకో కధ తెస్తున్నారు.– తానే మా చిన్నాన్నను చంపించాడు. తనకు చెందిన పోలీసులతో దర్యాప్తు చేయిస్తాడు. అనుకూల మీడియాలో కధనాలు వక్రీకరిస్తాడు. తన పాలన మీద చర్చ జరిగితే డిపాజిట్లు రావని చంద్రబాబుకు తెలుసు. అందుకే భావోద్వేగాలు రెచ్చగొట్టి ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నాడు అప్రమత్తంగా ఉండాలి,’ అని జగన్ హెచ్చరిక చేశారు.