ఆమ్రపాలి బదిలీ వెనుక ఇంత కథ ఉందా?

వరంగల్ అర్బన్ కలెక్టర్ గా ఎన్నో సంచలనాలు నమోదు చేసిన ఆమ్రపాలి ఎందుకు బదిలీ అయ్యారు. ఆమె బదిలీ రోటిన్ గానే జరిగిందా లేకా రాజకీయ కారణాలేమైన ఉన్నాయా.. వరంగల్ టిఆర్ ఎస్ నేతలు  ఆమ్రపాలి పై గుర్రుగా ఉన్నారా… వరంగల్ అర్బన్ కలెక్టర్ నుంచి హైదరాబాద్  జీహెచ్ ఎంసీ కి బదిలీ అయిన ఆమ్రపాలి బదిలీ వెనుక ఉన్న కథపై తెలుగురాజ్యం స్పెషల్ స్టోరీ చదవండి.

స్మార్ట్ సిటీగా వరంగల్ గుర్తింపు పొందడంతో కేంద్రప్రభుత్వ పథకాలైన నిర్మల్, హృదయ్ వంటి పథకాల అమలుకు వందల కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. జిల్లా కలెక్టర్ గా యంగ్ లేడి ఉండటంతో వరంగల్ అభివృద్ది వేగంగా పెరుగుతుందని అంతా అనుకున్నారు. ఆమ్రపాలి కూడా డేర్ అండ్ డాష్ లేడి కావడంతో అంతా సవ్యంగానే సాగుతుందనుకున్నారు. ఆమ్రపాలి ఏం మాట్లాడినా.. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అది సంచలనమే.

డిప్యూటి సీఎం కడియం శ్రీహరి వరంగల్ జిల్లాకు చెందిన వారే కావడంతో నిత్యం కార్యక్రమాలతో బిజీ షెడ్యూల్ జిల్లా అధికారులకు ఉండేది. అయితే ఆమ్రపాలికి కడియం శ్రీహరికి ఎప్పుడు పడకపోయేదని, వారి మధ్య వైరమే ఉండేదని పలువురు స్థానిక నాయకుల ద్వారా తెలుస్తోంది. అసలు ఆమ్రపాలికి వరంగల్ లో పనిచేయడం ఇష్టం లేదని ఆమె కరీంనగర్ జిల్లాకు పోస్టింగ్ ఇవ్వమని కోరుకున్నా ఇవ్వకుండా వరంగల్ ఇచ్చారని అందుకే ఆమె ఇక్కడున్నన్నాళ్లు అసంతృప్తిగానే పనిచేశారని కీలక అధికారుల ద్వారా తెలుస్తోంది.

మంత్రి కేటిఆర్ వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పై రివ్యూ నిర్వహించారు. ఆ సమావేశంలో కేటిఆర్ అడిగిన పలు ప్రశ్నలకు ఆమ్రపాలి సమాధానం చెప్పలేకపోయిందని కనీసం సమాచారం కూడా కలెక్టర్ వద్ద లేకపోవడంతో కేటిఆర్ ఆమ్రపాలిపై సీరియస్ అయ్యారని నాయకులు గుర్తు చేశారు. వరంగల్ కలెక్టర్ గా ఆమ్రపాలి ప్రజలకు ఏం చేయలేదని సాయంత్రం 5 దాటితే ఆమ్రపాలి ఎవరికీ కలిసే వారు కాదని పలువురు నేతలు అంటున్నారు.

ఆమ్రపాలికి పలువురు నేతలు పద్దతి మార్చుకోవాలని చెప్పినా ఆమె తనకు నచ్చినట్టే ఉండేవారట. ముఖ్యంగా ఆమ్రపాలి మోడరన్ దుస్తులు ధరించి గుడికి హాజరు కావడంపై రాష్ట్రమంతా పెద్ద చర్చే జరిగింది. సీఎం కేసీఆర్ కూడా ఈ విషయంలో ఆమ్రపాలిని మందలించినట్టు అప్పట్టో వార్తలొచ్చాయి. అప్పుడే డిప్యూటి సీఎం కడియం కూడా ఆమ్రపాలిని గట్టిగానే హెచ్చరించాడట. అప్పటి నుంచే కడియంకు, ఆమ్రపాలికి విబేధాలు పెరిగాయని నాయకులు అంటున్నారు. ఆమ్రాపాలి ప్రజా సంక్షేమంలో పెద్దగా మార్పులు తీసుకురాలేదని, అభివృద్ది పనులు కూడా అంతంత మాత్రంగానే జరిగాయని ప్రజలు అంటున్నారు. గొప్ప కలెక్టర్ గా పేరున్న ఆమ్రపాలి తన మోడరన్ ఇమేజ్ కు ఇచ్చిన వాల్యూ ప్రజా సంక్షేమాలకు ఇస్తే బాగుండేదని నాయకులు అంటున్నారు.

నాయకులతో విబేధాలు, ఇష్టం లేని ప్రదేశంలో పనిచేయడం ఇటువంటి వాటితో ఆమ్రపాలి అయిష్టంగానే పనిచేశారట. అందుకే ఆమె కావాలని హైదరాబాద్ కు ట్రాన్స్ ఫర్ చేయమని ఏ శాఖైనా సరే హైదరాబాద్ అయితే చాలని బదిలీ చేయించుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరో వైపు ఎన్నికలు సమీపిస్తున్న వేళ బలమైన కలెక్టర్ ఉంటే ప్రజల్లోకి తొందరగా వెళ్లవచ్చనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఆమ్రపాలిని బదిలీ చేసిందని నాయకులు అంటున్నారు. అందుకే పాటిల్ ప్రశాంత్ జీవన్ ని కలెక్టర్ గా నియమించారని గతంలో వరంగల్ జేసిగా చేసిన అనుభవం ప్రశాంత్ కు ఉండటంతో అన్ని విధాల అనుకూలంగా ఉంటుందని నాయకులు అనుకున్నట్టుగా తెలుస్తోంది.

బదిలీలలో భాగంగా ఆమ్రపాలి హైదరాబాద్ జీహెచ్ ఎంసీకి బదిలీ అయ్యారు. హైదరాబాద్ బదిలీ అయినా కూడా ఆమె వెంటనే విధుల్లో చేరలేదు. సెప్టెంబర్ 10 వరకు తాను విధుల్లో చేరుతానని ఆమ్రపాలి సీఎస్ కి సమాచారం ఇచ్చారు. మొత్తానికి ఆమ్రపాలి ఇన్ని సమస్యల మధ్యే ఇన్నాళ్లు వరంగల్ లో పనిచేశారా అని అంతా చర్చించుకుంటున్నారు.