సూర్యాపేట జిల్లాలో పోలింగ్ సిబ్బంది ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. ఓటు వేసేందుకు క్యూలైన్ లో గంటల కొద్ది ఓటర్లు నిలబడితే సిబ్బంది మాత్రం లంచ్ టైం అయ్యిందంటూ పోలింగ్ రూంకు తాళం వేసుకొని వెళ్లి పోయారు. సిబ్బంది తీరు పై ఓటర్లు మండిపడుతున్నారు.
తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని తిరుమలగిరి మండల కేంద్రంలోని 291వ పోలింగ్ బూత్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓటర్లు దీనికి సంబంధించిన ఫొటోను తీసి, వాట్సాప్ లో పెట్టడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
నిబంధనల ప్రకారం భోజన సమయంలో పోలింగ్ సిబ్బంది ఒకరి తర్వాత మరొకరు వెళ్లి భోజనం చేసి రావాల్సి ఉంటుంది. పోలింగ్ ప్రక్రియ ఆగిపోకుండా సిబ్బంది పని చేయాల్సి ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు ఏ క్షణంలో వచ్చినా, వారికి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించాల్సి ఉంటుంది.
కానీ, ఇక్కడి పోలింగ్ సిబ్బంది తాళం వేసి వెళ్లిపోవడంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలింగ్ సిబ్బంది మళ్లీ వచ్చి తాళం తెరిచారు. ఈ ఘటన పై విచారణ జరిపిస్తామని రిటర్నింగ్ అధికారి తెలిపారు.