ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే బీజేపీకి లాభం ఏంటి.. ఏదో ట్విస్ట్ ఉందంటూ?

తెలంగాణకు చెందిన నలుగురు ప్రముఖ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నించిందని ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్ల రూపాయల డబ్బు ఆఫర్ చేసిందని టీ.ఆర్.ఎస్ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నించడం చర్చనీయాంశమైంది. అయితే ఇందుకు సంబంధించి ఎన్నో అనుమానాలు ఉన్నాయి.

తెలంగాణలో 2024 ఎన్నికలు జరగడానికి కేవలం 18 నెలల సమయం మాత్రమే ఉంది. నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినా రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోయే పరిస్థితి అయితే లేదు. నేతలను కొనుగోలు చేయడం వల్ల బీజేపీ రాష్ట్రంలో పుంజుకునే అవకాశం కూడా లేదని చెప్పవచ్చు. మరి బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఎందుకు ఆసక్తి చూపించిందనే ప్రశ్నకు జవాబు దొరకడం కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ఎవరు ప్రయత్నించినా టీ.ఆర్.ఎస్ పార్టీ మాత్రం తెలివిగా అడుగులు వేయడం ద్వారా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుండటం గమనార్హం. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో లీక్ కావాల్సిన విషయాలు చాలానే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మునుగోడు ఉపఎన్నికలో ఓడిపోతే 2024లో టీ.ఆర్.ఎస్ రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా చేయాలని బీజేపీ అడుగులు వేస్తోంది.

టీ.ఆర్.ఎస్, బీజేపీ పార్టీల మధ్య విచిత్రమైన పోటీ ఏర్పడటం హాట్ టాపిక్ అవుతోంది. ఎమ్మెల్యేలతో బేరసారాల విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. గతంలో రేవంత్ రెడ్డిని ఇరికించిన టీ.ఆర్.ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు బీజేపీ నేతలను ఇరికించారని కామెంట్లు వినిపిస్తున్నాయి. పోలీసుల విచారణలో ఏం తెలుస్తుందో చూడాల్సి ఉంది.