కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వ రద్దు కేసులో హైకోర్టు సీరియస్ అయింది. ఇప్పటికే వారి సభ్యత్వాలు పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ తెలంగాణ సర్కారు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కోర్టు ధిక్కరణ కేసును హైకోర్టులో ఫైల్ చేశారు. ఈ కేసు శుక్రవారం విచారణకు వచ్చింది.
ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ ల కోర్టు ధిక్కరణ పిటిషన్ పై హైకోర్టు లో విచారణ సందర్భంగా న్యాయస్థానం సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో శాసన సభ సభ్యత్వ రద్దు పై కోర్టు ఇచ్చిన తీర్పు ను ఎందుకు అమలు చేయడం లేదని ప్రభుత్వం పై హైకోర్టు సీరియస్ అయింది. వారం రోజుల్లో దీనిపై స్పష్టత ఇవ్వక పోతే అసెంబ్లీ కార్యదర్శి, అసెంబ్లీ లా లేజిస్లేటి సెక్రెటరీలు ఇద్దరూ కోర్టుకు నేరుగా హాజరు కావాల్సి ఉంటుందన్న వార్నింగ్ ఇచ్చింది హైకోర్టు.
ప్రభుత్వ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రామచందర్ రావు పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మీరు ప్రభుత్వ న్యాయవాది గా ఉన్నారా లేక రాజకీయ పార్టీ న్యాయవాది గా ఉన్నారా అని ఆయనను సూటిగా ప్రశ్నించింది హైకోర్టు. వారం రోజుల్లో దీనిపై స్పష్టత ఇవ్వాలని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ కు హైకోర్టు ఆదేశాలిస్తూ.. తదుపరి విచారణను ఆగస్టు 3 కు వాయిదా వేసింది.