తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, కొడంగల్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ని మిడ్ నైట్ బెడ్రూమ్ తలుపులు పగలగొట్టి అరెస్టు చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. జరిగిన ఘటనపై న్యాయస్థానం సీరియస్ అయింది. అర్ధరాత్రి రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని పోలీసులను ప్రశ్నించింది.
అంతేకాదు జరిగిన ఘటనపై డిజిపి మహేందర్ రెడ్డికి షాక్ ఇచ్చింది. మధ్యాహ్నం 2.30 గంటలకు డిజిపి మహేందర్ రెడ్డి నేరుగా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.
రేవంత్ రెడ్డి అర్ధరాత్రి అరెస్టును నిరసిస్తూ మంగళవారం వేం నరేందర్ రెడ్డి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం విచారించిన న్యాయస్థానం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. బుధవారం ఉదయం మళ్లీ విచారణ జరిపిన న్యాయస్థానం కేసు విచారణలో భాగంగా డిజిపి మహేందర్ రెడ్డి తీరుపై సీరియస్ అయింది. అర్ధరాత్రి అరెస్టు చేసి ఈడ్చుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. అంతేకాకుండా డిజిపిని ఆదేశాలు జారీ చేసింది.
రేవంత్ రెడ్డి అరెస్టు విషయంలో మంగళవారం కూడా హైకోర్టు తెలంగాణ పోలీసులకు, ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. ప్రజాస్వామ్యంలోనే మనం ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందని హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీద ఫైర్ అయింది. రేవంత్ రెడ్డి బంద్ కు పిలుపునివ్వడంలో తప్పేముందని ప్రశ్నించింది. తెలంగాణలో పోలీసు వ్యవస్థ కుప్పకూలిపోయిందా అని ప్రశ్నించింది. ముఖ్యమంత్రి సభ కు రక్షణ కల్పించే పరిస్థితి లేదా అని నిలదీసింది. శాంతిభద్రతులు పోలీసుల చేయి దాటిపోయాయా అని నిలదీసింది. లాఠీఛార్జీలు, బాష్పవాయు గోళాలు ప్రయోగించలేక రేవంత్ రెడ్డిని నిర్బంధంలోకి తీసుకున్నారా అని ప్రశ్నించింది.
అంతేకాకుండా రాష్ట్రంలో ఇది మూడో కిడ్నాప్ కేసు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేస్తానంటే చాలు మాయం చేస్తారా అని నిలదీశింది. ఇదేమి ప్రజాస్వామ్యం అని ప్రశ్నించింది. బ్రటిషీ్ రాజ్యాన్ని తలపిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డి అక్రమ అరెస్టుపై వేం నరేందర్ రెడ్డి వేసిన పిటిషన్ ను జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విచారణలో తెలంగాణ ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేసిన పరిస్థితి ఉంది.
రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేశారన్న ప్రశ్నకు పిిపి సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఇంటెలిజన్స్ నివేదిక ఆధారంగా ముందస్తు అరెస్టు చేశామన్నారు. ఏ ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా ముందస్తు అరెస్టు చేశారో ఆ నివేదిక తమకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆ నివేదికను కొద్దిసేపటి తర్వాత సమర్పిస్తామన్నారు. అప్పుడు మధ్యాహ్నం 2.30 గంటలకు కోర్టు విచారణను వాయిదా వేసింది. అప్పుడు కూడా నివేదికను సమర్పించలేకపోయింది సర్కారు. నివేదిక ఇవ్వాల్సిన వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణ సిఎం సభలో ఉన్నారని, తర్వాత నివేదిక ఇస్తామని కోర్టుకు తెలిపారు. అయితే మళ్లీ సాయంత్రం 4.30 గంటలకు వాయిదా వేసింది.
అయినప్పటికీ నివేదిక అందజేయలేదు. దీంతో సాంకేతికత పునికిపుచ్చుకున్న ఆధునిక కాలంలో ఎందుకు వివరాలు, నివేదికలు అందజేయలేకపోతున్నారని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే సిఎం సభ అయిపోగానే రేవంత్ రెడ్డిని విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. పూర్తి నివేదికలు బుధవారం సమర్పిస్తామని చెప్పారు. దీంతో విచారణను బుధవారానికి వాయిదా వేసింది న్యాయస్థానం.
బుధవారం విచారణ చేపట్టిన తర్వాత డిజిపి స్వయంగా ధర్మాసనం ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసి మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణను వాయిదా వేసింది న్యాయస్థానం.
రేవంత్ రెడ్డి అరెస్టు వీడియోలు కింద ఉన్నాయి చూడొచ్చు.