తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వేసిన స్కెచ్ కాంగ్రెస్ సీనియర్ నేతలు సూదిని జైపాల్ రెడ్డి, కుందూరు జానారెడ్డికి గట్టి ఝలక్ తాకింది. వారిద్దరికే కాదు ఈ కేసులో మరో ఇద్దరు ఉద్ధండ నేతలకు సైతం షాక్ తప్పలేదు. ఇంతకూ ఉత్తమ్ స్కెచ్ ఏంటి? జానా, జైపాల్ కు ఝలక్ ఎందుకు? వీరిద్దరితో పాటు షాక్ కు గురైన మరో ఇద్దరు ఎవరు? కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయ వర్గాల ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా ఈ స్టోరీ.. చదవండి.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం సిడబ్ల్యూసి తోపాటు ఆహ్వానితుల కమిటీలను ప్రకటించారు. 23 మందితో కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నిర్ణాయక కమిటీ ‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ’ కొలువుదీరింది. ఇందులో తెలంగాణ నుంచి ఒక్కరంటే ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. అంతేకాదు కనీసం మిగిలిన కమిటీల్లో అయినా తెలంగాణ వారికి చోటు దక్కిందా అంటే అదీ లేదు. ఒకవైపు బలపడి అధికారంలోకి రావాలని ఆశతో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఉంది. 2019 లో తెలంగాణలో అధికారం వస్తుందని కాంగ్రెస్ అంచనాల్లో మునిగితేలుతున్నది. ఈ పరిస్థితుల్లో ఇక్కడి నేతలకు ఒక్కరంటే ఒక్కరికైనా కీలక కమిటీల్లో స్థానం దక్కితే అటు జాతీయ పార్టీకి కానీ, ఇటు తెలంగాణ నాయకత్వానికి కానీ గౌరవంగా ఉండేదని పార్టీ కేడర్ చర్చించుకుంటున్నారు. కానీ ఎందుకు అధిష్టానం ఇలా చేసిందన్నది ఇప్పుడు పార్టీ వర్గాలను తొలుస్తున్న ప్రశ్న.
నిజానికి తెలంగాణ కాంగ్రెస్ నుంచి నలుగురు నేతల్లో ఎవరో ఒకరిని సిడబ్ల్యూసికి తీసుకోవాలని అధిష్టానం ఆలోచన చేసినట్లు వార్తలొచ్చాయి. ఆ నలుగురిలో అత్యంత సీనియర్లుగా ఉన్న జైపాల్ రెడ్డి, జానారెడ్డి, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్యల పేర్లు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చక్రం తిప్పి వీరిలో ఎవరికీ చోటు దక్కకుండా చేశారని ప్రచారం సాగుతోంది. వీరు జాతీయ స్థాయిలో ప్రయత్నాలు చేసుకోకుండా ఉత్తమ్ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు అంటున్నారు. వీరి నలుగురితో ఉత్తమ్ మీకే సిడబ్ల్యూసిలో చాన్స్ వస్తుంటే మీకే వస్తుందని ఎవరికి వారికే భరోసా ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఉత్తమ్ నాకే సపోర్ట్ చేస్తారని జానా, నాకే అని జైపాల్, నాకే అని పొన్నాల, నాకే సపోర్టు అని గీతమ్మ ఎవరి ఆశల్లో వారు ఉన్నారు. అందరినీ అలా ఉత్తమ్ నమ్మించారని అంటున్నారు. దీంతో అందరూ అధిష్టానం వద్ద పెద్దగా ప్రయత్నాలు చేయలేదట. ఇక్కడ వీరితో ఈ మాట చెప్పిన ఉత్తమ్ అధిష్టానం పెద్దలకు మాత్రం తెలంగాణ నుంచి ఎవరికీ సిడబ్ల్యూసిలో చోటు కల్పించాల్సిన అవసరం లేదని చెప్పేశారట. సిడబ్ల్యూసి లో లేకపోయినా కనీసం ఆహ్వానితుల జాబితాలోనైనా చోటు కల్పించాలన్న ఉద్దేశంతో అధిష్టానం ఉన్నా.. ఉత్తమ్ వద్దే వద్దు అని వారించారని అంటున్నారు. దీంతో అధిష్టానం వారు తెలంగాణ నేతలను పరిగణలోకి తీసుకోకుండానే కమిటీ రూపకల్పన చేశారని తెలుస్తోంది. మరి ఎవరికీ చోటు దక్కుకుండా ఉత్తమ్ ఎందుకు చేశారబ్బా అన్నదానికి కూడా పెద్ద కారణమే ఉందని పాలమూరుకు చెందిన తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు ఒకరు తెలుగు రాజ్యం కు తెలిపారు.
2019 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు గడ్డం తీసేదిలేదని ఉత్తమ్ ప్రతినబూనారు. దీంతో ఆయన గడ్డం పెంచుకునే తిరుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో 2019లో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు ఆయన శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సీనియర్లైన జానా, జైపాల్, పొన్నాల, గీతారెడ్డి లాంటి వారికి సిడబ్ల్యూసిలో చోటు దక్కితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సిఎం రేసులోకి వారే దూకుతారన్న ఉద్దేశంలో ఉత్తమ్ ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే వారెవరికీ పై కమిటీలో చోటు లేకపోతే తానే సిఎం రేసులో ఉంటాను కదా అనే భావనతోనే ఇలాంటి స్కెచ్ వేశారని అంటున్నారు. ఉత్తమ్ ఈ స్కెచ్ ద్వారా అధిష్టానం వద్ద పలుకుబడి బాగా పెరిగిందని అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ లాంటి నేతలు కూడా ఇంతటి స్థాయిలో పాలిటిక్స్ చేయలేదని అంటున్నారు. మరి ఇంతవరకు బాగానే ఉన్నా.. ఉత్తమ్ మీద ఆ నలుగురు సీనియర్లు ఎలా రెస్పాన్డ్ అవుతారన్నది చూడాల్సి ఉంది.