ప్రత్యర్థులను చిత్తు చేయడంలో కేసీఆర్ పద్దతే వేరు. ఆయన ఏదైనా విమర్శ చేశారు అంటే తప్పకుండా దానికి అర్థం ఉండి తీరుతుంది. ఇతరుల మాటల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కేసీఆర్ మాటల్ని మాత్రం తప్పకుండా పరిగణలోకి తీసుకుంటారు జనం. ఆయన మాటలకు అంతటి ఆకర్షణ ఉంది. ఇక ప్రత్యర్థుల సంగతైతే చెప్పనక్కర్లేదు. తోక ముడవాల్సిందే. అలాంటి కేసీఆర్ శిక్షణలో ఎదిగిన నేత హరీష్ రావు. తొలినాళ్ళ నుండి మామ అడుగుజాడల్లో నడిచిన హరీష్ రావు వారసత్వాన్నే కాదు ఆయనలోని లక్షణాలను కూడ అందుకున్నారు. హరీష్ రావు విమర్శలు, ప్రశ్నలు కూడ కేసీఆర్ స్థాయిలోనే ఉంటాయి.
అందుకు ఉదాహరణే దుబ్బాక ప్రచారంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మీద ఆయన విసిరిన ప్రశ్న. బీజేపీ తమ ప్రచారంలో దుబ్బాకలో తెరాస చేసింది ఏమీ లేదని, జనం అష్టకష్టాలు పడుతున్నారని, సంక్షేమ ఫలాలు అందడంలేదని, వారికి అనుకూలం కాని వారి మీద కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి వారు కూడ ఇదే పాట పాడారు. వీటికి మొదట్లో తెరాస నుండి ఎలాంటి సమాధానం రాలేదు కానీ ప్రచారం చివరి రోజు మాత్రం హరీష్ రావు తిరుగులేని కౌంటర్ వేశారు. ఆ ప్రశ్నకు బీజేపీ నేతలకు సమాధానం చెప్పే సమయం కూడ లేకుండా పోయింది.
రఘునందన్ తండ్రి మాదవనేని భగవంతరావుకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పింఛన్ ప్రతి నెల వస్తుందని వారికి నెల నెల రేషన్ ద్వారా 6 కిలోల బియ్యం మొత్తంగా 12 కిలోల బియ్యం అందుతోందని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పెట్టుబడి సహాయం కింద ఆయన తండ్రికి 2 ఎకరాల 15 గుంటలకు కాను ఇప్పటి వరకు 54వేల రూపాయలు, ఆయన తల్లి భారతమ్మ 3 ఎకరాల 30 గుంటలకు 86 వేల 250 రూపాయలు సహాయం, రఘునందన్ రావు 4 ఎకరాల 30 గుంటలకు గాను ఒక లక్ష 11 వేల 550 రూపాయల సహాయం అందుకుంటున్నారని తెలిపారు. ఇలా ప్రభుత్వ పథకాలన్నీ అందుకుంటూ ప్రభుత్వం ఇదే విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
హరీష్ రావు చెప్పిన లెక్కలో ఎలాంటి తప్పూ లేదు. రఘునందన్ రావు కుటుంబానికి అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అసలు హరీష్ రావు ఈ ప్రశ్న లేవనెత్తుతారని బీజేపీ నేతలు ఊహించి కూడ ఉండరు. కానీ హరీష్ లోతుల్లోకి వెళ్లి అన్నిటికినీ పరిశీలించి విమర్శను సంధించారు. ఈ షాక్ నుండి తేరుకునేలోపే ప్రచార గడువు ముగిసింది. ఇప్పుడు హరీష్ ప్రశ్న సమాధానం లేకుండా బీజేపీ చుట్టూ చక్కర్లు కొడుతోంది. జనం మనసుల్లో సైతం హరీష్ మాటలు బాగా నాటుకున్నాయి. విమర్శ చేయడం అంటే పెద్ద నోరు వేసుకుని పడిపోవడం కాదని సరైన టైంలో సరైన ప్రశ్నతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేయాలని ఆయన్ను చూస్తే అర్థమవుతుంది.