రాజ్ భవన్ లాజిక్: గవర్నర్ పుట్టలో సీఎం వేలుపెడితే… కుట్టరా?

చీమా చీమా ఎందుకు కుట్టావంటే… నా పుట్టలో వెలు పెడితే కుట్టనా అందట. ఈ విషయంలో చీమే అంత చేస్తే… మరి గవర్నర్ స్థాయి వ్యక్తి ఏమి చేస్తారు.? ఎంత చేస్తారు? ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ తీవ్రంగా నడుస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా తమవద్దే పెట్టుకున్నారంటూ సుప్రీం వరకూ వెళ్లింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో కొన్ని బిల్లులను ఆమోదించిన గవర్నర్… మరికొన్ని బిల్లులను మాత్రం ఆమోదించకుండా.. రాష్ట్రపతికి పంపించడం జరిగింది. అయితే… గవర్నర్ ఆపిన ఆ బిల్లుల విషయంలో.. తమిళసై లాజిక్ అర్ధవంతంగానే ఉందనే కామెంట్లు చేస్తున్నారు విశ్లేషకులు.

అవును… తెలంగాణ గవర్నర్ ఆ బిల్లులను ఆమోదించకపోవడానికి బలమైన కారణం ఉందని చెబుతున్నారంట రాజ్ భవన్ అధికారులు! ప్రభుత్వం పంపిన రెండు బిల్లుల విషయంలో గవర్నర్ చాలా ఆగ్రహంగా ఉన్నారంట! తన పరపతిని తగ్గించే బిల్లులను రూపొందించడం పట్ల ఆమె అసహనం వ్యక్తం చేస్తున్నట్టు చెబుతున్నారు. అలా గవర్నర్ ఆగ్రహానికి కారణమైన బిల్లులు “ది తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లు – 2022” మరియు “అటవీ యూనివర్సిటీ బిల్లు”!

ముందుగా… “ది తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లు – 2022” విషయానికొస్తే… ఈ బిల్లు ప్రకారం… అన్ని యూనివర్సిటీలోని పోస్టుల భర్తీకి ఒక కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేసి, తద్వారా ప్రభుత్వమే పోస్టులు భర్తీ చేస్తుంది! అయితే… ఇంతకాలం ఉన్న నిబంధనల ప్రకారం.. ఏదైనా వర్సిటీ, కొత్త పోస్టులను భర్తీ చేస్తే.. ఆ వివరాలు గవర్నర్ కు పంపిస్తూ ఉంటుంది. గవర్నర్ వాటిని పరిశీలించి అనుమతి ఇస్తారు. సవరణలు ఉంటే గవర్నర్ కు ఆ రిక్రూట్మెంట్ ను నిలిపివేసే హక్కు కూడా ఉంటుంది. కానీ… తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఆమోదించిన బిల్లు “కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్” ఏర్పడితే.. గవర్నర్ కు ఎలాంటి పరిశీలన అధికారులు ఉండవు.

ఇక… “అటవీ యూనివర్సిటీ బిల్లు” విషయానికొస్తే… ఈ బిల్లుపై కూడా గవర్నర్ ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తుంది. ఈ బిల్లు ప్రకారం… కొత్తగా ఏర్పడబోయే ఈ యూనివర్సిటీకి ఉపకులపతిగా ముఖ్యమంత్రి ఉంటారు. దీంతో… ఈబిల్లు పట్ల కూడా గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఏ యూనివర్సిటీకైనా ఉపకులపతిగా గవర్నర్ ఉంటారు. కానీ… ఈ బిల్లు విషయంలో గవర్నర్ ను సైడ్ చేసి.. సీఎం కు ఆ హోదా ఇవ్వడం కూడా తమిళ సై కి నచ్చలేదని అంటున్నారు.

ఇలా గవర్నర్ పరపతిని ఉద్దేశపూర్వకంగా తగ్గిస్తూ పొందుపరిచిన ఈ బిల్లులను.. గవర్నర్ కావాలనే ఆమోదించకుండా ఆపారని.. ఫలితంగా రాష్ట్రపతికి పంపారని అంటున్నారు! ఇక్కడ రాష్ట్రపతి ఆ బిల్లులను ఆమోదించాలంటే… ముందుగా కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఆమోదించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో… ఈ బిల్లు ఇప్పట్లో ఆమోదం పొందే ఛాన్స్ లేనట్లేనని జోస్యం చెబుతున్నారు విశ్లేషకులు. ఫలితంగా ఇది తెలంగాణ సర్కార్ కు పెద్ద దెబ్బ అని అంటున్నారు.