పొలం పనులకు వెళ్లి…విద్యుత్ ఘాతానికి బలైన అన్నదాత?

మరణం ఎప్పుడు ఎలా సంభవిస్తుందో ఎవరూ ఊహించలేరు. కొన్ని సందర్భాలలో ఊహించని పరిణామాల వల్ల కొన్ని నిమిషాలలోనే ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ముఖ్యంగా విద్యుత్ ప్రమాదాల వల్ల తరచూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల కూడా ఇటువంటి విషాద సంఘటన చోటుచేసుకుంది. పొలాన్ని నమ్ముకొని బ్రతుకుతున్న రైతు ఆ పొలంలోనే విద్యుత్ ప్రమాదం వల్ల ప్రాణాలు కోల్పోయి విగతజీవిగా మారిన ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

వివరాలలోకి వెళితే…రేగొండ మండలంలోని దుంపిల్లపల్లి గ్రామానికి చెందిన బత్తిని కొమురయ్య(45) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల తేలికపాటి వర్షం పడడంతో గ్రామసమీపంలో ఉన్న తన పొలంలో శుక్రవారం ఉదయం మిరప నాట వేయటానికి కూలీలను పిలిపించాడు. ఈ క్రమంలో మిరప చెట్లు నాటటానికి అవసరమైన అచ్చు మొద్దు ప్రక్కన గల రైతు పొలంలో ఉండగా దానిని తన భుజంపై పెట్టుకుని తన పొలంలోకి తీసుకు వస్తున్నాడు.

ఆ తరుణంలో తన పొలంలో క్రిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి కరెంట్ షాక్ కొట్టడంతో కొమరయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతని వెనకే వస్తున్న శ్రీకాంత్ రవి గమనించి అతనిని కాపాడాలని ప్రయత్నం చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. దీంతో కొమరయ్య మరణించిన విషయాన్ని అతని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులకు తెలియజేశారు. స్థానికులు హుటా హుటిన అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కొమర ఎండుతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
కొమరయ్య మరణం తో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.