తెలంగాణ అంతటా ప్రగతి నివేదన సభ హడావిడి కనబడుతున్నది. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ప్రగతి నివేదన కసరత్తు జరుగుతున్నది. ట్రాక్టర్లు, బస్సులు, కార్లు ప్రగతి నివేదన సభకు తరలి వస్తున్నాయి. ఎటు చూసినా గులాబీ మయమైన పరిస్థితి ఉంది.
కానీ ఆ ఊరిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. టిఆర్ఎస్ హడావిడి పెద్దగా లేదు. శుక్రవారం గ్రామంలో బంద్ జరిపారు. రోడ్డు మీదకొచ్చి జనాలు నిరసన తెలిపారు. వారంతా ఎందుకు అలా బంద్ జరిపి నిరసన తెలిపారంటే.. తమకు తెలంగాణ ప్రభుత్వం ఆశచూపి మోసం చేసిందన్న కారణంగానే.
జిల్లాల విభజన సందర్భంగా నల్లగొండ జిల్లాలోని గట్టుప్పల్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించారు. పోలీసు స్టేషన్, ఎమ్మార్వో ఆఫీసు, ఎండిడిఓ ఆఫీసు ఏర్పాటు చేశారు. తీరా తెల్లారితే మండలం ఆవిర్భవించేవేళ మండలాన్ని క్యాన్సల్ చేశారు. దీంతో కడుపు మండిన గ్రామస్థులు 690 రోజులుగా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు.
గ్రామంలో ఎవరు కూడా టిఆర్ఎస్ ప్రగతి సభకు పోవద్దని తీర్మానం చేశారు. మండలాన్ని ఇచ్చే వరకు ఆందోళన కంటిన్యూ చేస్తామని వారు అంటున్నారు. గ్రామంలో బంద్ ఎలా జరుగుతుందో, గ్రామస్థుల ఆందోళన ఎలా సాగుతుందో పైన వీడియోలు ఉన్నాయి చూడండి.