కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి తుపాకి గురిపెట్టి కాల్చి చంపుతానని బెదిరించినట్లు వ్యాపారవేత్త ఎర్రబెల్లి రవీందర్ రావు శాయంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితోపాటు ఆయన సోదరుడు భూపాల్ రెడ్డి మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గండ్ర వెంకట రమణారెడ్డి కేసుల విషయమై మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ ఆపద్ధర్మ ప్రభుత్వం కాంగ్రెస్ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించారు. రాజకీయంగా ఎదుర్కొలేక కాంగ్రెస్ నేతలను కేసులలో ఇరికిస్తున్నారని గండ్ర ఆరోపించారు. ముందుగా తన తమ్ముడిని చంపుతానని ఎర్రబెల్లి రవీందర్ రావు బెదిరించారని గండ్ర ఆరోపించారు. తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా పోలీసులు ఎర్రబెల్లి ఫిర్యాదు చేయగానే వెంటనే తమపై కేసులు ఫైల్ చేశారన్నారు. తామే ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.
అసలు తన వద్ద తుపాకీ లేనే లేదని గండ్ర స్పష్టం చేశారు. తన తమ్ముడు భూపాల్ రెడ్డి వద్ద కూడా తుపాకీ లేదన్నారు. తామిద్దరం 2015లోనే పరకాల పోలీసు స్టేషన్ లో సరెండర్ చేశామన్నారు. తుపాకులే లేనప్పుడు కాల్చి చంపుతామని తుపాకీతో బెదిరించామని ఫిర్యాదు చేయడం, కేసులు బనాయించడం చూస్తే కక్ష సాధింపు తప్ప మరొకటి కాదన్నారు.
కేసుల పేరుతో తమ క్యాడర్ ను భయభ్రాంతులకు గురి చేయాలని కేసీఆర్ చూస్తున్నాడని ఆరోపించారు. తక్షణమే డిజిపి పూర్వపరాలను పరిశీలించి విచారణ జరపాలని గండ్ర డిమాండ్ చేశారు.