నందమూరి వంశంలో ఎన్టీఆర్ తర్వాత ఆయన వారసత్వంలో అంతటి పాపులారిటీని సంపాదించారు జూనియర్ ఎన్టీఆర్. బాలకృష్ణ కూడా సుదీర్ఘ కాలం సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ కు అతి కొద్దికాలంలో తాతకు తగ్గ మనవడు అని స్టార్ డమ్ వచ్చింది. అటువంటి జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయంగా వాడుకోవాలనుకున్న టిడిపి నాయకత్వానికి షాక్ తగిలింది. ఆ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ తన మార్కు చూపించారు. మరి ఆ ముచ్చటేందో కింద చదవండి.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలను రాజకీయంగా ఎపిలో వినియోగించుకోవాలని టిడిపి అధినేత చంద్రబాబు స్కెచ్ వేసుకున్నారు. ఆ దిశగానే తెలంగాణలో కూటమి ఏర్పాటు చేయించారు. జన్మతహా ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ తో తెలంగాణలో జట్టు కట్టారు. కావాలని అతి తక్కువ సీట్లు తీసుకుని కాంగ్రెస్ ను బంపర్ మెజార్టీతో గెలిపించాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ ప్రయోగంలో వచ్చిన ఫలితాల ఆధారంగా ఎపిలో యాక్ట్ చేయాలనుకున్నారు. తెలంగాణ ఎన్నికల అనుభవాలను చూసి ఎపిలో తన వ్యూహం రూపొందించుకోవచ్చనుకున్నారు. కానీ ఒక విషయంలో జూనియర్ ఎన్టీఆర్ వ్యూహాత్మక అడుగులు వేసి చంద్రబాబు ఆలోచనలకు బ్రేక్ వేశారు.
తెలంగాణ ఎన్నికల్లో కూకట్ పల్లి నుంచి నందమూరి సుహాసిని ని బరిలోకి దించారు చంద్రబాబు. కూటమిలో భాగంగా కూకట్ పల్లి సీటును టిడిపి తీసుకుంది. ఈ సీటును నందమూరి వంశానికి ఇవ్వడంలో చంద్రబాబు మాంచి స్కెచ్ వేశారుని టిడిపి వర్గాల్లో టాక్ ఉంది. నందమూరి సుహాసిని ని బరిలోకి దించడం ద్వారా నందమూరి వంశం అంతా టిడిపికి పనిచేసేలా చేయడం దీని ఉద్దేశంగా కనబడుతున్నది. అలా ఆమెను బరిలోకి దింపి ఎన్టీఆర్ వారసత్వంలో మాస్ ఫాలోయింగ్ ఉన్న జూనియర్ ను పార్టీకి ప్రచారం చేయించాలన్న ఆలోచన ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో జూనియర్ తో ప్రచారం చేయించిన తర్వాత పనిలో పనిగా ఆంధ్రా ఎన్నికల్లోనూ రేపు ప్రచారం చేయించాలన్న ఆలోచన ఉన్నట్లు చెబుతున్నారు.
కానీ జూనియర్ ఎన్టీఆర్ సుహాసిని పోటీ విషయంలో ఆలోచించి వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు కనబడుతున్నది. సుహాసినికి టికెట్ అనౌన్స్ చేయగానే అక్కకు అభినందనలు తెలిపారు జూనియర్ ఎన్టీఆర్. ఈమేరకు ట్విట్టర్ లో స్పందించారు. సోదరి పోటీ చేయబోతున్నందుకు అభినందనలు. ఆమె విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. ఇక ట్వీట్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రచారానికి రాకపోతాడా అని అటు టిడిపి అధినాయకత్వం, ఇటు నందమూరి ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూశారు. కానీ జూనియర్ మాత్రం ప్రచారానికి వెళ్లకూడదు అని నిర్ణయించుకున్నట్లు వార్తలొచ్చాయి.
జూనియర్ ఎన్టీఆర్ అక్క సుహాసిని కి ప్రకటనతోనే మద్దతు ఇచ్చి సరిపుచ్చుకునే అవకాశాలే కనబడుతున్నాయి. అంతకు మించి తెలంగాణ రాజకీయాల్లో తాను జోక్యం చేసుకోరాదన్న ఆలోచనలో యంగ్ టైగర్ ఉన్నట్లు సమాచారం. ఇదే కాకుండా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే ఏ నాయకుడైనా, ఫిల్మ్ స్టార్ అయినా వారి పేర్లను ఈసి కి ఆయా పార్టీలు సమర్పించాల్సి ఉంటుంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి వరకు టిడిపి పెద్దలకు ప్రచారం పై సమ్మతి రాలేదని చెబుతున్నారు. అందుకే జూనియర్ పేరును కూడా ఈసి కి టిడిపి సమర్పించలేదని తెలుస్తోంది.
2019లో జూనియర్ ఏం చేయబోతున్నారు ?
రానున్న రోజుల్లో అయినా జూనియర్ ఎన్టీఆర్ టిడిపికి ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం చేస్తారా? లేదంటే సినిమాలకే పరిమితం అవుతారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చాలా అవసరం అన్న భావన పార్టీ శ్రేణుల్లో ఉంది. 2009 లో జూనియర్ ఎన్టీఆర్ మహా కూటమి కి జోరుగా ప్రచారం చేశారు. కానీ అప్పుడు టిడిపి, టిఆర్ఎస్, సిపిఐ, సిపిఎం పార్టీల కూటమిని చిత్తు చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఒంటిచేత్తో గెలిపించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో జూనియర్ ప్రచారానికి దూరంగానే ఉన్నారు. మరి 2019 లో ఆయన ఏం చేస్తారా అని రెండు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.