ఆయన ఒకప్పుడు తెలంగాణ ఉద్యమకారుడు. టిఆర్ఎస్ పుట్టిన తొలినాళ్లలోనే ఆయన ఎమ్మెల్యే. 2004లో వైఎస్ కేబినెట్ లో ఆయన మంత్రి. టిఆర్ఎస్ పార్టీ తరుపున వైఎస్ కేబినెట్ లో చేరిన ఆరుగురు మంత్రుల్లో ఆయన కూడా ఒకరు. కానీ తర్వాత కాలంలో ఆయన ప్రతిష్ట రోజురోజుకూ దిగజారిపోయింది. ఇంతకూ ఎవరా మాజీ మంత్రి? ఆయనను కాంగ్రెస్ ఎందుకు సస్పెండ్ చేసిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఎ.చంద్రశేఖర్ తెలంగాణ పోరాట యోధుడు. 2004లో టిఆర్ఎస్ పార్టీ తరుపున (కాంగ్రెస్, టిఆర్ఎస్, సిపిఎం, సిపిఐ కలిసి ఆనాడూ కూటమిగా పోటీ చేశాయి.) వికారాబాద్ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు. వెంటనే పొత్తులో భాగంగా వైఎస్ కేబినెట్ లో అప్పుడు ఆరుగురు మంత్రులయ్యారు. హరీష్ రావు, ఎ.చంద్రశేఖర్, నాయిని నర్సింహ్మారెడ్డి, శనిగరం సంతోష్ రెడ్డి, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డాక్టర్ విజయరామారావు మంత్రులుగా పనిచేశారు.
తదనంతర కాలంలో టిఆర్ఎస్ ఎత్తుగడల్లో భాగంగా మంత్రులు రాజీనామా చేశారు. అయితే ఆ తర్వాత 2009 ఎన్నికల సమయంలో వీరిలో కొందరు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అలా తిరుగుబాటు బావుటా ఎగురవేసిన వారిలో ఎ.చంద్రశేఖర్ ఒకరు. ఆయన టిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. 2004లో తప్ప ఇక ఏనాడూ ఎ.చంద్రశేఖర్ తిరిగి అసెంబ్లీకి ఎన్నిక కాలేకపోయారు. మొన్న 2018లో ఆయనకు సర్వేల్లో మంచి రికార్డు లేదన్న కారణంగా కాంగ్రెస్ టికెట్ ఇవ్వడాన్ని నిరాకరించింది.
ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో ఎ.చంద్రశేఖర్ కాంగ్రెస్ రెబెల్ గా బరిలోకి దిగారు. అయినా ఆయన ఓటమి చవిచూశారు. ఎన్నికల తర్వాత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై తెలంగాణ పిసిసి కత్తి దూస్తున్నది. అందులో భాగంగానే ఎ.చంద్రశేఖర్ ను కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించింది. పిసిసి క్రమశిక్షణా కమిటీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. పార్టీ నిర్ణయాన్ని ఉల్లంఘించి వికారాబాద్ లో రెబెల్ గా పోటీ చేసినందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు క్రమశిక్షన సంఘం వెల్లడించింది. కోదండరరెడ్డి ఛైర్మన్ గా ఉన్న పిసిసి క్రమశిక్షణ కమిటీ ఈ నిర్ణయాన్ని సోమవారం మీడియాకు వెలువరించింది.