పెళ్లయి 6 ఏళ్లు. చదువుకున్న భార్య దొరికింది. టీచర్ ట్రైనింగ్ కూడా పూర్తి చేసింది. కానీ.. ఉద్యోగం మాత్ర రాలేదు. నిజానికి తనకు ఉద్యోగం వస్తుందన్న ఆశతోనే అతడు.. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కానీ.. ఆమెకు ఇంకా ఉద్యోగం రాకపోవడంతో విసుగు చెందాడు. దీంతో తనలో ఉన్న మృగం నిద్రలేచాడు. దాంతోపాటు ఇద్దరు కూతుళ్లే పుట్టడంతో కోపంతో రోజూ తాగి వచ్చి భార్యను, ఇద్దరు కూతుళ్లను వేధిస్తుండేవాడు.
రోజూ ఇదే తంతు. రోజూ తాగి ఇంటికి రావడం.. భార్యను కొట్టడం.. పిల్లలను కూడా హింసించడం.. అలవాటుగా మారింది. రోజూ లాగే ఇటీవల కూడా తాగి వచ్చిన ఆ వ్యక్తి.. భార్యను విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో భార్య భయపడి ఇంట్లో నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. తన పిల్లలను తీసుకొని పారిపోయేందుకు ప్రయత్నించగా… నాలుగేళ్ల రెండో కూతురును పట్టుకొని తనను చిత్రహింసలకు గురి చేశాడు. ఆ చిన్నారిపై ఉమ్మేశాడు. చిన్నారిని తీవ్రంగా కొట్టాడు.
తన భర్త కూతురును చిత్రహింసలకు గురి చేయడానికి తన ఫోన్ లో రికార్డు చేసిన భార్య.. వెంటనే తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వాళ్లకు చూపించింది. వాళ్లు సరిగ్గా ఈ ఘటనపై స్పందించకపోవడంతో.. ఇక లాభం లేదనుకొని వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి భర్త మీద ఫిర్యాదు చేసింది.
దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ మృగాన్ని అరెస్ట్ చేసి తల్లి, ఇద్దరు కూతుళ్లను షెల్టర్ కు పంపించారు. ఈ ఘటన తెలంగాణలోని వికారాబాద్ లో చోటు చేసుకుంది.